ANDHRAPRADESH:బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అనివార్యం అయిన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్ పై విజయం సాధించిన మాగంటి గోపీనాథ్ జూన్ 8వ తేదీన అనారోగ్యంతో కన్నుమూయడంతో ప్రస్తుతం అక్కడ ఉపఎన్నికపైన అన్ని రాజకీయ పార్టీలు దృష్టి సారిస్తున్నారు.
జూబ్లీ హిల్స్ ఎన్నికలను కీలకంగా భావిస్తున్న రాజకీయ పార్టీలు
ఎన్నికల సంఘం నియమాల ప్రకారం ఆరు నెలల్లోపు ఉప ఎన్నిక జరగాల్సి ఉండగా, ఈ ఉపఎన్నిక చాలా కీలకంగా అందరూ భావిస్తున్నారు. ఈ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తే ఆ పార్టీ భవిష్యత్తు ఎన్నికలలో కూడా దూసుకుపోతుంది అన్న అభిప్రాయం పలువురిలో వ్యక్తమౌతుంది.
కాంగ్రెస్ అభ్యర్థి పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
తాజాగా అధికార కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థి ఎవరు అన్నది ఆసక్తికరంగా మారిన వేళ కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ అభ్యర్థి ఎంపికపైన కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ బై పోల్ లో స్థానికులకే టికెట్ ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. స్థానికేతరులకు టికెట్ ఇచ్చేది లేదని ఆయన తేల్చి చెప్పారు. కేవలం గెలిచే సత్తా ఉన్న లోకల్ అభ్యర్థికి మాత్రమే టికెట్ ఇస్తామని ఆయన ప్రకటించారు.
జూబ్లీహిల్స్ స్థానంపై అన్ని పార్టీల గురి
దీంతో అభ్యర్థి ఎవరు అన్న దానిపైన అటు పార్టీలోను స్థానికంగానూ పెద్దఎత్తున చర్చ జరుగుతుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తుంటే, జూబ్లీహిల్స్ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇటీవల కంటోన్మెంట్ ఉప ఎన్నికలలో విజయం సాధించి జోష్ తో ఉన్న కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ లో కూడా విజయం సాధించి, రాష్ట్రంలో తమ పట్టును నిలుపుకోవాలని ప్రయత్నం చేస్తుంది.
కాంగ్రెస్ నుండి టికెట్ రేసులో వీరు
ఇక కాంగ్రెస్ పార్టీ నుండి గత ఎన్నికలలో మాగంటి గోపీనాథ్ కు పోటీ ఇచ్చి రెండవ స్థానానికి పరిమితమైన అజారుద్దీన్ తో పాటు స్థానికంగా పట్టున్న నవీన్ యాదవ్, పీజేఆర్ కుమార్తె విజయ రెడ్డి, ఫిరోజ్ ఖాన్ తదితరులు రేసులో ఉన్నట్టు సమాచారం. ఈ నలుగురు లోకల్ అభ్యర్థులు కావడంతో వీరిలో ఎవరికి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.