Hot Posts

6/recent/ticker-posts

రైల్వేకు కేరాఫ్ ఖాజీపేట్


HYDERABAD:తెలంగాణలో మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. దీనివల్ల వరంగల్ జిల్లా దశ దిశ మారడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం సగానికి పైగా పూర్తయింది. తుదిదశకు చేరుకుంటోంది.

అదే- రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. 160 ఎకరాల విస్తీర్ణంలో ఖాజీపేట్ వద్ద నిర్మితమౌతోంది. దీని నిర్మాణ వ్యయం 521 కోట్ల రూపాయలు. ఇక్కడ వ్యాగన్లు తయారు కానున్నాయి. సంవత్సరానికి 2,400 వ్యాగన్ల తయారీ సామర్థ్యంతో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం కొనసాగుతోంది.

2023 జులై 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆర్ఎంయు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. తొలుత దీన్ని వ్యాగన్ రిపేర్ వర్క్‌షాప్, పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ యూనిట్‌గా ప్రతిపాదించారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం దీని స్థాయిని పెంచింది. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా బదలాయించింది. 

కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, జీ కిషన్ రెడ్డి తాజాగా ఈ యూనిట్ ను సందర్శించారు. పనుల పురోగతిపై క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించారు. అనంతరం వారిద్దరు విలేకరులతో మాట్లాడారు. కోచ్‌లు, ఇంజిన్లు, మెట్రో రైళ్లను తయారు చేయడానికి రూపొందుతున్న అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ రైల్వే యూనిట్ మేక్ ఇన్ ఇండియాకు నిదర్శనమని అన్నారు. 

అమృత్ భారత్ పథకం కింద 40 స్టేషన్లను ఆధునికీకరిస్తోన్నామని అశ్విని వైష్ణవ్ చెప్పారు. డబ్లింగ్, విద్యుదీకరణ, కొత్త రైలు మార్గాలతో రైల్వే నెట్ వర్క్ ను మరింత బలోపేతం చేయనున్నామని తెలిపారు. ఖాజీపేటలో రైల్వే తయారీ యూనిట్ ఏర్పాటు చేయడం.. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కట్టుబడి ఉన్నారనడానికి నిదర్శనమని చెప్పారు.

ఈ యూనిట్ లో 78 శాతం పనులు పూర్తయ్యాయి. మెయిన్ షాప్ అంటే వ్యాగన్ల తయారీ కోసం కేటాయించిన యూనిట్ నిర్మాణం పూర్తయింది. మిగిలిన వాటిల్లో పెయింట్ వర్క్‌షాప్, స్టోర్‌ వార్డు, పిట్ ట్రావెర్సెస్, టెస్ట్ షాప్ శరవేగంగా నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటోన్నాయి. 

2026 నాటికి ఈ యూనిట్ అందుబాటులోకి వస్తుందని ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితమౌతుందని జీ కిషన్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ జోన్లకు ఇక్కడి నుంచే రైల్వే వ్యాగన్లు సరఫరా కావడం ఖాయంగా కనిపిస్తోంది. సంవత్సరానికి 2,400 వ్యాగన్లను తయారు చేయాలంటూ రైల్వే మంత్రిత్వ శాఖ భావిస్తోన్న నేపథ్యంలో- వీటి కొరత తీరుతుందని జీ కిషన్ రెడ్డి చెప్పారు.


Author

Shakir Babji Shaik

Editor | Amaravathi