పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో బీసీలు ఎందుకు గుర్తుకురాలేదని కాంగ్రెస్ ప్రశ్న
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించింది కేసీఆరేనని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపణ
మహిళా మంత్రి లేనప్పుడు కవిత ఎందుకు స్పందించలేదని నిలదీత
ANDHRAPRADESH:బీసీ రిజర్వేషన్ల అంశంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాయడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. కవిత చర్య హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి పట్టించుకోని బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు లేఖలు రాయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడారు. ఏ హోదాలో కవిత ఈ లేఖ రాశారో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకురాలిగానా? లేక జాగృతి అధ్యక్షురాలిగానా? అని ఆయన ప్రశ్నించారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను 21 శాతానికి కుదించారని, ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు కవిత ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
అంతేగాక 2014 నుంచి 2018 మధ్య రాష్ట్ర క్యాబినెట్‌లో ఒక్క మహిళకు కూడా ప్రాతినిధ్యం లేనప్పుడు, మహిళా ఉద్యమ నాయకురాలిగా చెప్పుకునే కవిత ఎందుకు స్పందించలేదని ఆయన విమర్శించారు. సాటి మహిళలకు అన్యాయం జరుగుతున్నప్పుడు మాట్లాడని కవితకు ఇప్పుడు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi