ANDHRAPRADESH:డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ: జిల్లాలో మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండల విద్యుత్ సమస్యలపై రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ట్రాన్స్ కో అధికారులతో వెదురుమూడి సబ్ స్టేషన్ వద్ద సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కపిలేశ్వరపురం మండలంలో వివిధ గ్రామాలకు సంబంధించిన విద్యుత్ సమస్యలపై నాయకులు నుండి వినతులు స్వీకరించారు.
అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ కపిలేశ్వరపురం మండలంలోని విద్యుత్ సమస్యల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను విధ్యుత్ శాఖా మంత్రి జి.రవికుమార్ దృష్టికి తీసుకువెళ్లటం జరిగిందన్నారు. దీనిపై ఆయన వెంటనే స్పందించి టేకి గ్రామంలో సబ్ స్టేషన్ మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తి అయితే కపిలేశ్వరపురం మండలంలో ఎక్కడా విద్యుత్ సమ్యలు ఉండవన్నారు.
అనంతరం జిల్లా ట్రాన్స్ కో ఎస్.ఈ రాజేశ్వరి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదేశాలు మేరకు డిశంబర్ నాటికి మండలంలో విద్యుత్ సమస్యలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ డి.సి.ఎం.ఎస్ చైర్మన్ రెడ్డి ప్రసాద్, మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ, బోణం వెంకట శ్రీనివాస్, ఎలక్ట్రికల్ అధికారులు ఇ.ఇ రత్నాలరావు, డి.ఇ.ఇ శ్రీధర్, ఎ.ఇ., జె.ఇ., సిబ్బంది పాల్గొన్నారు.

Vijaya Babu. I
Staff Report | Konaseema