ఈ క్రమంలో ఆమె కూడా సానుకూలంగా స్పందించటంతో వీరి బంధం వివాహేతర సంబంధంగా మారింది.
Hyderabad:డాక్టర్ దంపతుల జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిన రీల్స్ భామ పుణ్యమా అని పచ్చని సంసారం ఛిన్నాభిన్నం కావటమే కాదు..భార్య ఆత్మహత్య చేసుకుంటే.. భర్త జైల్లో ఊచలు లెక్కిస్తున్న దుస్థితి. ఇదంతా పరాయి స్త్రీ వ్యామోహంలో పడి హాయిగా సాగుతున్న జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకోవటంగా చెప్పాలి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్న దంత వైద్యురాలి ఆత్మహత్య పెను సంచలనంగా మారింది. ఇంతకూ అసలేం జరిగిందంటే.
ఇన్ స్టా.. ఫేస్ బుక్ ఫ్లాట్ పాంలో రీల్స్ చేస్తుండే యువతి పట్ల వరంగల్ కు చెందిన ఒక డాక్టర్ ఆకర్షితుడు కావటం.. వీరి వ్యవహారం పెళ్లి వరకు వెళ్లటంతో సదరు డాక్టర్ ఫ్యామిలీలో గొడవలు షురూ అయ్యాయి. చివరకు డాక్టర్ భార్య దంతవైద్యురాలు తీవ్రమైన మానసిక.. శారీరక వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న వైనం షాకింగ్ గా మారింది. అయితే.. భర్త తరఫు వారు దంతవైద్యురాలిది ఆత్మహత్యగా చెబుతుండగా.. బాధితురాలి తల్లి మాత్రం తన కుమార్తెను హత్య చేసి..ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. వరంగల్ నగరంలో తీవ్ర సంచలనంగా మారిన ఈ ఉదంతంలో డాక్టర్ బాబును పోలీసులు అరెస్టు చేశారు.
వరంగల్ నగరానికి చెందిన డాక్టర్ సృజన్ కు రీల్స్ చేసే యువతికి మధ్య పరిచయం.. అంతకంతకూ ముదిరి వివాహేతర సంబంధంగా మారింది అని ఆరిపోస్తున్నారు . ఇంతకూ సదరు రీల్స్ యువతితో డాక్టర్ పరిచయం ఎలా జరిగిందన్న విషయంలోకి వెళితే.. డాక్టర్ సృజన్ వరంగల్ లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో కార్డియాలజీ వైద్యుడు. సదరు ఆసుపత్రి ప్రారంభ వేడుకలకు యూట్యూబర్.. సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ అయిన యువతిని ఆసుపత్రి ప్రమోషన్ వర్కు కోసం నియమించారు. ఈ క్రమంలో ఆసుపత్రిలోని వైద్యుల్ని ఆమె చేత ఇంటర్వ్యూలు చేయించారు. ఈ క్రమంలో ఆమె మోజులో పడ్డాడు డాక్టర్ సృజన్.
ఈ క్రమంలో ఆమె కూడా సానుకూలంగా స్పందించటంతో వీరి బంధం వివాహేతర సంబంధంగా మారింది. సదరు యువతి తాను చేసిన రీల్స్ లో తాను గుండె ఆపరేషన్ ను లైవ్ లో చూసినట్లు కూడా చెప్పటం చూస్తే.. ఆమెను డాక్టర్ బాబు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. అతడి కారును ఆమె వాడేదని.. భార్య రెండో కాన్పు కోసం పుట్టింటికి వెళ్లినప్పుడు యువతి డాక్టర్ విల్లాకు వచ్చి ఉండేదన్న ఆరోపణలు ఉన్నాయి.
రీల్స్ యువతి అంశంపై ఇంట్లో తరచూ గొడవలు అయ్యేవి. రీల్స్ యువతి మోజులో పడిన డాక్టర్ భార్యను వేధింపులకు గురి చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. తన భర్త చేష్టల గురించి దంతవైద్యురాలైన భార్య ప్రత్యూష తన అత్తమామలకు ఫిర్యాదు చేసింది. వారు కలుగజేసుకొని కొడుకును వారించినా డాక్టర్ సృజన్ లో మాత్రం మార్పు రాలేదు.
ఇదిలా ఉండగా.. ‘ఇంఫులెన్సర్’ను పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి డాక్టర్ సృజన్ రావటంతో ఇంట్లో గొడవలు మరింత ముదిరాయి. ఈక్రమంలో ఆదివారం సాయంత్రం భార్య ప్రత్యూష వరంగల్ లోని ఆసుపత్రిలో చేరిందని.. ఆమెకు చికిత్స చేస్తున్నట్లుగా అత్త పద్మావతికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా చెప్పటంతో..ఆమె హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుంది. అప్పటికే ప్రత్యూష విగతజీవిగా కనిపించటంతో తన కూతుర్ని.. అల్లుడే హత్య చేసినట్లుగా ఆమె ఆరోపిస్తున్నారు. ఈ ఉదంతంపై స్పందించిన పోలీసులు డాక్టర్ సృజన్ ను అరెస్టు చేశారు.