Hot Posts

6/recent/ticker-posts

తెలంగాణ నయాగరా బొగత వాటర్ ఫాల్స్ వెళ్లే వారికి గమనిక..!!


HYDERABAD:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ప్రత్యేకించి- తెలంగాణపై దీని తీవ్రత అధికంగా ఉంటోంది. హైదరాబాద్‌ను ఇప్పటికే అతి భారీ వర్షం ముంచెత్తింది. మరో రెండు రోజుల పాటు ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

పశ్చిమ- మధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ దక్షిణ ప్రాంతాల మీదుగా విస్తరించింది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో సహా వివిధ జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల అటు తెలంగాణలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. మరో 48 గంటల పాటు అంటే 25వ తేదీ వరకు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులతో వర్షాలు పడొచ్చని తెలిపింది.

ములుగు, ఖమ్మం, నల్లగొండ, జయశంకర్-భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉంది. పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్, భదాద్రి కొత్తగూడెం, వికారాబాద్, వనపర్తి, కొమురంభీం ఆసిఫాబాద్, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలో మోస్తరు వర్షాలు పడొచ్చు.

హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో తెలంగాణ అతలాకుతలమైంది. రాష్ట్రవ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలన్నీ నిండుతున్నాయి. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

భారీ వర్షాల ప్రభావం వల్ల బొగత జలపాతం ఉరకలు వేస్తోంది. తెలంగాణ నయాగరాగా గుర్తింపు ఉన్న బొగత జలపాతం వరద నీటితో పోటెత్తుతోంది. ములుగు జిల్లాలో ఉందీ వాటర్ ఫాల్స్. దీని అందాలను తిలకించడానికి అక్కడ నిర్మించిన విజిటర్స్ పాయింట్ కూడా దీని తీవ్రతకు దాదాపుగా మునిగిపోయింది.

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యగా జల వనరుల మంత్రిత్వ శాఖ తాజా నిర్ణయాన్ని తీసుకుంది. బొగత జలపాతాన్ని సందర్శకుల కోసం మూసివేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ సందర్శకులుఎవరికీ కూడా జలపాతం వద్దకు వెళ్లడానికి అనుమతి ఉండదు.

బొగతతో పాటు ముత్యం ధార, కొంగల, మామిడిలొద్ది, కృష్ణాపురం వంటి వాటర్ ఫాల్స్ అన్నింటినీ కూడా మూసివేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ సందర్శకులెవరినీ అనుమతించరు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించి సందర్శకులు ఎవరైనా అటు వెళ్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.