INDIA:తమిళనాడులోని చెన్నైలో వరుస బాంబు బెదిరింపులు వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలంగా మారింది. మొదట అల్వార్‌పేటలోని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఆ తర్వాత కొద్ది సేపటికే నీలంకరైలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత, ప్రముఖ నటుడు దళపతి విజయ్ నివాసానికీ కూడా బెదిరింపు కాల్ వచ్చింది. ఈ వరుస ఘటనలతో చెన్నైలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
సీఎం ఇంట్లో బాంబు పెట్టాం
పోలీసుల సమాచారం ప్రకారం.. విఘ్నేష్ అనే వ్యక్తి చెన్నై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి "ఈ రోజు సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడానికి ముందే సీఎం స్టాలిన్ ఇంట్లో బాంబు పెట్టాం" అని హెచ్చరించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDS), డాగ్ స్క్వాడ్‌ను సీఎం నివాసానికి పంపి క్షుణ్ణంగా తనిఖీలు జరిపారు. అయితే అక్కడ ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అది ఫేక్ కాల్ అని నిర్ధారించారు. అయినప్పటికీ భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని అధికారులు వెల్లడించారు.
దళపతి విజయ్..
అలానే విజయ్ నివాసానికి కూడా బాంబు బెదిరింపు కాల్ రావడంతో పోలీసులు మరోసారి అలర్ట్ అయ్యారు. బాంబ్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్‌తో ఆయన ఇంటి ప్రతి మూలను గాలించారు. ఎలాంటి పేలుడు పదార్థాలు కనిపించకపోవడంతో ఈ కాల్ కూడా ఫేక్ అని నిర్ధారించారు. ప్రస్తుతం ఈ ఫేక్ కాల్స్ వెనుక ఉన్న వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే ఆయన అభిమానులు భారీ సంఖ్యలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉండడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
ఈ ఫేక్ బెదిరింపుల ఘటన తమిళనాడులో పెద్ద సెన్సేషన్‌గా మారింది. సీఎం స్టాలిన్ మరియు విజయ్ ఇళ్లకు ఒకే రోజున వచ్చిన బెదిరింపు కాల్స్ వెనుక ఉద్దేశం ఏమిటి? అని విచారణ చేస్తున్నారు. కాగా బెదిరింపు కాల్ చేసిన నంబర్ ఆధారంగా విఘ్నేష్ అనే వ్యక్తిని ట్రేస్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నేరస్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.