Hot Posts

6/recent/ticker-posts

హరి హర వీరమల్లు ప్రమోషన్ కు టీడీపీ కండిషన్ ? తెరపైకి హెరిటేజ్ ?


 HYDERABAD:ఏపీలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న కూటమి పార్టీలు ఎంతో సమన్వయంగా ముందుకెళ్తున్నాయి. క్షేత్రస్ధాయిలో చిన్నా చితకా విభేదాలున్నా వాటిని పట్టించుకోవద్దని అధినేతలు క్యాడర్ ను కోరుతున్నారు. మరోవైపు కూటమిలో చిచ్చుపెట్టేందుకు వైసీపీ ఆశగా ఎదురుచూస్తోంది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ సినిమా హరి హర వీరమల్లు ఐదేళ్ల తర్వాత విడుదలైంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఈ సినిమాను బాయ్ కాట్ అంటూ, ప్లాప్ అంటూ తీవ్రంగా ప్రచారం చేసింది. సినిమా ఫలితం కూడా దాికి తగ్గట్టుగానే ఉండటంతో జనసేన ఆత్మరక్షణలో పడింది.

అంతలోనే కోలుకుని హరి హర వీరమల్లు పవన్ ధర్మరక్షణ కోసం తీసిన సినిమా అని, దీనిపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత జనసేనతో పాటు కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీపైనా ఉందని జనసేన నేతలు చెప్తున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మిడియాలోనూ విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు ఎవరికి వారు స్వయంగా బాధ్యత తీసుకుని జనానికి ఉచితంగా ఈ సినిమా షోలు వేయించి చూపిస్తున్నారు. పవన్ కూడా ఏకంగా ఢిల్లీలోని ఏపీ భవన లో ఈ సినిమా ప్రత్యేక షోలు వేయించారు.

ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కోరుతున్న విధంగా హరి హర వీరమల్లును ఓన్ చేసుకుని క్షేత్రస్దాయిలో ప్రచారం చేయడం టీడీపీకి ఇష్టం లేదని ఆ పార్టీ క్యాడర్ సోషల్ మీడియాలో పెడుతున్న ట్వీట్లు, పోస్టులు చూస్తే అర్దమవుతోంది. టీడీపీకి చాలా అంశాల్లో అండగా నిలిచే ఆ పార్టీ సానుభూతిపరులు సోషల్ మీడియాలో హరి హర వీరమల్లును తామెందుకు ప్రమోట్ చేయాలని, సినిమాలో దమ్ముంటే ఏ ప్రమోషన్ అక్కర్లేదని, ఆ మాట కొస్తే బాలకృష్ణ సినిమాల్ని సపోర్ట్ చేయమని మిమ్మల్ని ఎప్పుడైనా అడిగామా అని పలు ప్రశ్నలు సంధిస్తున్నారు

ఇదే క్రమంలో మరో అంశాన్ని కూడా టీడీపీ క్యాడర్ తెరపైకి తెస్తోంది. అదే చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్. కూటమిలో ఉన్న పార్టీల నాయకులు, క్యాడర్ అంతా హెరిటేజ్ ఉత్పత్తులే వాడాలని ఓ జీవో పాస్ చేయాలని వారు కోరుతున్నారు. హెరిటేజ్ కు మీరు మద్దతిస్తే మేం హరి హర వీరమల్లుకు మద్దతిస్తామనేలా ఈ ప్రచారం సాగుతోంది. దీంతో జనసేన క్యాడర్ దీనిపై ఏం చేయాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఎప్పటిలాగే జనసేన సోషల్ కార్యకర్తలు టీడీపీ ట్వీట్లకు ఎదురుదాడితో కౌంటర్లు పెడుతున్నారు.