ప్రొఫెసర్ చేసిన తప్పుకు విద్యార్థులు ఫెయిల్
ఓ ప్రొఫెసర్ చేసిన తప్పు కారణంగా మూడు కాలేజీలకు చెందిన 138 మంది విద్యార్థులు ఫెయిల్ అయిన ఘటన జేఎన్టీయూలో చోటుచేసుకుంది పరీక్ష ఫలితాలు వెలువడిన తర్వాత తమ పిల్లలు కీలకమైన సబ్జెక్టులో ఫెయిల్ అవ్వడం చూసిన తల్లిదండ్రులు విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఓ విద్యార్థి చేసిన ఫిర్యాదు తో పొరపాటును గుర్తించిన అధికారులు ఫలితాలను తిరిగి సరిచేసి పంపించారు.
జేఎన్టీయూ బీటెక్ నాలుగో ఏడాది పరీక్షలలో 138 మంది ఫెయిల్
గత నెలలో జరిగిన జేఎన్టీయూ బీటెక్ నాలుగో ఏడాది రెండవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను ఈనెల 17వ తేదీన విడుదల చేశారు. ఈ ఫలితాలలో చివరి ఏడాదిలో ఉండే క్రెడిట్ బేస్డ్ సబ్జెక్టు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లో మల్లారెడ్డి, షాదన్, శ్రీ దత్త కు చెందిన 138 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు.
జేఎన్టీయూ పరీక్షల విభాగానికి విద్యార్థి ఫిర్యాదు
అయితే శ్రీ దత్త కళాశాలకు చెందిన ఒక విద్యార్థికి ఈ ఫలితాల పైన అనుమానం వచ్చి జె.ఎన్.టి.యు పరీక్షల విభాగానికి మెయిల్ చేశాడు. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లో ఎంతమంది ఫెయిల్ అవడానికి అవకాశం లేదని, మరొకసారి పరీక్ష ఫలితాలను పరిశీలించాలని ఆయన తన మెయిల్లో కోరాడు దీంతో జేఎన్టీయూ అధికారులు అప్రమత్తమై ఫలితాలను తనిఖీ చేశారు.
ప్రొఫెసర్ ఘోర తప్పిదాలు చేసినట్టు గుర్తించిన జేఎన్టీయూ
మొత్తం ఈ సబ్జెక్టులో 138 మంది ఫెయిల్ అవ్వడాన్ని గుర్తించారు. ఇంతమంది ఎలా ఫెయిల్ అయ్యారని పరీక్ష జవాబు పత్రాలను తిరిగి పరిశీలించగా పేపర్లు దిద్దిన ప్రొఫెసర్ ఘోరమైన తప్పిదాలు చేసినట్టుగా గుర్తించారు. పరీక్ష ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో వేర్వేరు ప్రశ్న పత్రాలతో ఎగ్జామ్ నిర్వహించగా, ప్రొఫెసర్ మాత్రం వేర్వేరు జవాబు పత్రాలతో కాకుండా ఒకే జవాబు పత్రంతో రెండు పేపర్లను దిద్దారు. దీనివల్ల విద్యార్థులు 138 మంది ఫెయిలయ్యారు.
తిరిగి ఫలితాల ప్రకటన
ఇది గుర్తించిన జేఎన్టీయూ పరీక్షల విభాగం మళ్లీ జవాబు పత్రాలను మూల్యాంకనం చేయించారు. ఈసారి 138 మంది పాసయ్యారు. దీంతో మళ్లీ ఫలితాలను గురువారం రాత్రి ప్రకటించారు విద్యార్థులందరూ పాస్ అవ్వడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే సమయంలో పిల్లల ప్రశ్న పత్రాల విషయంలో నిర్లక్ష్యం చేసిన ప్రొఫెసర్ పైన వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాలని, నిర్లక్ష్యంగా ప్రవర్తించిన ప్రొఫెసర్ పైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi