Hyderabad:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భూవివాదం కేసులో సుప్రీంకోర్టు నుంచి భారీ ఊరట లభించింది. ఇటీవల ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఎన్. పెద్దిరాజు అనే వ్యక్తి రేవంత్‌పై వేసిన పిటిషన్‌ను హైకోర్టు పూర్తిగా కొట్టివేసింది. దీంతో హైకోర్టు ఇచ్చిన ఆ తీర్పును సవాల్ చేస్తూ.. పెద్దిరాజు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
కాగా పెద్దిరాజు దాఖలు చేసిన పిటిషన్‌లో.. కేసును తెలంగాణ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా హైకోర్టు న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన తీర్పుపై పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి (CJI BR Gavai) నేతృత్వంలోని ధర్మాసనం, ఈ పిటిషన్‌ను పూర్తిగా తోసిపుచ్చింది.
పిటిషనర్ ఎన్. పెద్దిరాజు, అతని న్యాయవాది రితీష్ పాటిల్ పై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థపై అనవసర విమర్శలు చేయడమే కాకుండా, న్యాయమూర్తులపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం పట్ల అసహనం వ్యక్తం చేసింది. దీంతో ఇద్దరికీ కోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణకు పెద్దిరాజు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.
ఈ సందర్భంగా న్యాయవాది రితీష్ పాటిల్ కోర్టు ముందే క్షమాపణలు కోరారు. తాము దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు అనుమతించాలని కోరారు. అయితే కోర్టు ధిక్కరణ అంశం లైట్‌గా తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టంచేసిన సీజేఐ.. మీరు చెప్పిన క్షమాపణలు సరిపోవు, దీనిపై లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. తదుపరి విచారణను 2025 ఆగస్టు 11కి వాయిదా వేశారు. అప్పటిలోపు పిటిషనర్ లిఖితపూర్వక సమాధానాన్ని సమర్పించాల్సి ఉంటుంది. సమాధానం న్యాయసమ్మతంగా ఉంటే.. పరిగణనలోకి తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది.