ANDHRAPRADESH:ఏపీ నుంచి విదేశాలకు వెళ్లి నివాసం ఉంటున్న ఎన్నారైలకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. స్వరాష్ట్రానికి వచ్చినప్పుడు తిరుమల వెంకన్న దర్శనం చేసుకునే విషయంలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఏపీ ఎన్నార్టీ సొసైటీ చేసిన వినతిని సీఎం చంద్రబాబు ఆమోదించడంతో టీటీడీ ఈ నిర్ణయం అమల్లోకి తీసుకొస్తోంది. దీంతో ఇకపై ఎన్నారైలకు స్వామి వారి వీఐపీ బ్రేక్ దర్శనం సునాయాసంగా లభించబోతోంది.
గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రతి రోజూ ఎన్నారైలకు 50 వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు కేటాయించేవారు. ఆన్ లైన్ లో వాటిని బుక్ చేసి ఏపీకి వచ్చినప్పుడు దర్శనం చేసుకునే వారు. అయితే టీడీపీ ప్రభుత్వం మారి వైసీపీ రావడంతో ఈ సంఖ్యను 10కి తగ్గించేశారు. దీంతో వారికి తిరుమల దర్శనం ఇబ్బందిగా మారిపోయింది. ఈ విషయాన్ని ఏపీ ఎన్నార్టీ సొసైటీ అధ్యక్షుడు వేమూరి రవి కుమార్ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీఎం ఎన్నారైలకు వెంకన్న దర్శనానికి వీఐపీ బ్రేక్ పాసుల సంఖ్య పెంచేలా టీటీడీకీ ఆదేశాలు ఇచ్చారు.
ఈ మేరకు టీటీడీ ఇప్పుడు రోజువారీ ఎన్నారైలకు ఇచ్చే వీఐపీ బ్రేక్ దర్శనం పాసుల సంఖ్యను 100కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రవాసాంద్రుల కోసం ప్రత్యేకంగా టీసీఎస్ ద్వారా సేవా బ్రేక్ దర్శన టికెట్లు ఇవ్వనున్నట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. ప్రతి రోజు ఉదయం 10గంటలకు టికెట్లు ఆన్లైన్‌లో అందుబాటులో ఉంటాయని వారు పేర్కొన్నారు. ఎన్నారైలు తమ ఆధార్, పాస్‌పోర్ట్, వీసా వివరాలతో ఆన్ లైన్ లో ఈ వీఐపీ బ్రేక్ పాసుల కోసం నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు
దీంతో ఎన్నారైలకు ఇకపై ప్రతి రోజు 100 సేవా బ్రేక్ దర్శన టికెట్లు అందుబాటులో ఉంటాయి. విదేశాల్లో నివసించే ప్రవాసాంద్రులు టీటీడీ సహకారంతో ఏపీఎన్నార్టీఎస్ అధికారిక వెబ్ సైట్ https://www.apnrtcs.ap.gov.in లోకి లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవచ్చు. వీరి వివరాల పరిశీలన తర్వాత టికెట్లు మంజూరు చేస్తారు. వీఐపీ బ్రేక్ పాసుల విషయంలో మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ 0863 2340678ను కూడా అందుబాటులో ఉంచారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi