Hot Posts

6/recent/ticker-posts

వైసీపీకి తాజా టెన్షన్..! మరో ఎంపీపై కాసేపట్లో సుప్రీం నిర్ణయం..!


ANDHRAPRADESH:ఏపీలో విపక్ష వైసీపీ టార్గెట్ గా కూటమి సర్కార్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే ఓవైపు మద్యం స్కాంలో సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసిన ప్రభుత్వం.. మరోవైపు జగన్ పర్యటనల కేసుల్లో ఇద్దరు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజనీని విచారణకు పిలిచింది. అలాగే మద్యం స్కాంలో మాజీ ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామికి కూడా నోటీసులు పంపింది. ఇదంతా జరుగుతుండగానే మరో వైసీపీ సిట్టింగ్ ఎంపీ భవిష్యత్తుపై ఇవాళ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోబోతోంది.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. గతంలో తెలంగాణ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీన్ని రద్దు చేయాలని కోరుతూ సీబీఐతో పాటు ఆయన సోదరి, వివేకా కుమార్తె సునీతారెడ్డి కూడా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక విచారణ జరపబోతోంది.

ఇప్పటికే గత విచారణలో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడంతో ఆయన లాయర్లను కూడా అఫిడవిట్ వేయాలని కోరింది. ఈ అఫిడవిట్ కూడా దాఖలు కావడంతో బెయిల్ పై నిర్ణయం తీసుకునేందుకు సుప్రీంకోర్టు సిద్దమవుతోంది. గతంలో వివేకా కేసు దర్యాప్తు చేసిన సీబీఐ ఎస్పీ రాంసింగ్ తో పాటు వివేకా కుమార్తె సునీత దంపతుల్ని పోలీసులతో కేసులు పెట్టించి వేధించిన వ్యవహారంపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో వివరాలు సమర్పించింది. అలాగే సునీతతో పాటు సీబీఐ కూడా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

ఇప్పటికే వైఎస్ వివేకా కేసులో పలువురు నిందితుల్ని అరెస్టు చేసిన సీబీఐ.. జైలుకు పంపింది. అయితే ఇందులో కొందరు బెయిల్ తీసుకున్నారు. అయితే వీటిని పైకోర్టులో సవాల్ చేయకుండా సీబీఐ నాన్చుతుందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా వివేకా కేసులో దర్యాప్తు పూర్తి చేయకుండా సీబీఐ ఆలస్యం చేయడంపై ఆనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోసం సీబీఐ ఏ మేరకు పట్టుబడుతుందన్న దానిపై సుప్రీం నిర్ణయం ఆధారపడి ఉండబోతోంది.

Author

Shakir Babji Shaik

Editor | Amaravathi