ANDRAPRADESH:ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉందని, ఆయినా పోలీసులు ఆయనకు తగిన భద్రత కల్పించడం లేదని ఆ పార్టీ నేతలు కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా జగన్ రెంటపాళ్ల పర్యటన విషయంలోనూ తగిన భద్రత కల్పించకపోవడం వల్లే వైసీపీ కార్యకర్త సింగయ్య ఆయన కాన్వాయ్ కింద పడి చనిపోయారని ఆరోపించారు. ఈ కేసులో ప్రభుత్వం జగన్ సహా ఇతరులపై పెట్టిన కేసులపై దర్యాప్తును నిలిపేస్తూ ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
అయితే జగన్ తాజాగా నెల్లూరు పర్యటనకు వెళ్లాలని నిర్ణయించి చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నారు. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందే జగన్ నెల్లూరు టూర్ లో హెలిప్యాడ్ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం సహకరించడం లేదని, జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న జగన్ కు పోలీసులు తగిన భద్రత కల్పించడం లేదని వైసీపీ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
జగన్ కు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఇచ్చిన సందర్బంగా కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను తమ ముందు ఉంచాలని పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిని హైకోర్టు ఆదేశించింది. దీంతో వారు కేంద్రం మార్గదర్శకాలను హైకోర్టుకు సమర్పించబోతున్నారు. అనంతరం వీటిని పరిశీలించి అసలు జగన్ కు ఈ మార్గదర్శకాల ప్రకారం భద్రత లభిస్తుందో లేదో హైకోర్టు తేల్చబోతోంది. ఇది తేలితే జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా జడ్ ప్లస్ భద్రత కల్పించారా లేదా అనేది కూడా తేలిపోనుంది. దీంతో ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కీలకంగా మారాయి.
వాస్తవానికి జగన్ నెల్లూరు టూర్ వాయిదా వేసుకున్న నేపథ్యంలో ఈ పిటిషన్ పై విచారణ నిరర్ధకం అవుతుందని, దీన్ని కొట్టేయాలని ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. అయితే ఈ నిర్ణయానికి కారణమైన నేపథ్యం జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించకపోవడమే కాబట్టి దీనిపై విచారణ జరిపి తగు ఆదేశాలు ఇవ్వాలని వైసీపీ పిటిషనర్లు కోరుతున్నారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi