Hot Posts

6/recent/ticker-posts

ఏపీలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు ? సర్కార్ కసరత్తు..!


ANDRAPRADESH:ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో చేపట్టిన కార్యక్రమాలతో పాటు త్వరలో చేపట్టే కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు, మంత్రులు నిరంతరం సమీక్షలు జరుపుతూనే ఉన్నారు. ఇందులో పాలనా వ్యవస్ధలో పలు లోపాలు బయటపడుతూనే ఉన్నాయి. దీంతో వీటిని సరిదిద్దే క్రమంలో మరోసారి భారీ ఎత్తున అఖిల భారత సర్వీసు అధికారుల్ని (ఐఏఎస్, ఐపీఎస్)బదిలీ చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో రెగ్యులర్ గా భారీ స్దాయిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగి చాలా కాలమైంది. దీంతో పాటు పాలనా వ్యవస్దలో చేస్తున్న మార్పులు, వాటి అమలుకు అనుగుణంగా అధికారుల మార్పులకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇందులో భాగంగా ఎవరెవరిని ఎక్కడెక్కడికి మార్చాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రాష్ట్రంలో 10 జిల్లాలకు పైగా కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసే అవకాశం ఉంది.

ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలకు ప్రభుత్వం సిద్దమైంది. అయితే వరుస కార్యక్రమాలతో బిజీగా ఉన్న సీఎం చంద్రబాబు త్వరలోనే ఈ ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది. ఈ నెల మొదటి వారంలో లేదా 15వ తేదీలోపు ఈ బదిలీలు జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనిపై తుది కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఈసారి బదిలీల్లో ఎస్పీలు, కలెక్టర్లతో పాటు ఇతర అధికారుల మార్పులు కూడా ఉంటాయని అంటున్నారు. దీంతో అధికారులు కూడా ఈ బదిలీలపై ఆరా తీస్తున్నారు.

ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులపై మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఇవాళ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు కూడా అధికారుల తీరును నిరసిస్తూ విద్యాసంస్ధల బంద్ పాటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కీలక శాఖల్లో అధికారుల మార్పులు, చేర్పులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Author

Shakir Babji Shaik

Editor | Amaravathi