Hot Posts

6/recent/ticker-posts

భారత్‌లో ఐఫోన్ తయారీకి చైనా బ్రేక్? వెనక్కి వెళ్లిన వందలాది మంది ఇంజినీర్లు

భారత్‌లోని ఐఫోన్ ప్లాంట్ల నుంచి చైనా ఉద్యోగులను వెనక్కి పంపుతున్న ఫాక్స్‌కాన్

గత రెండు నెలలుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియ

ఇప్పటికే 300 మందికి పైగా చైనా సిబ్బంది స్వదేశానికి వెళ్లినట్లు సమాచారం

తయారీ రంగంలో టెక్నాలజీ, నిపుణుల తరలింపును అడ్డుకునే చైనా వ్యూహంలో భాగమేనని కథనాలు

స్థానిక కార్మికుల శిక్షణ, ఉత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపే అవకాశం

BOTH STATE:భారత్‌లో తయారీ రంగాన్ని భారీగా విస్తరించాలని ప్రణాళికలు రచిస్తున్న టెక్ దిగ్గజం యాపిల్‌కు అనూహ్య పరిణామం ఎదురైంది. యాపిల్ కోసం ఐఫోన్లను తయారుచేసే అతిపెద్ద భాగస్వామ్య సంస్థ ఫాక్స్‌కాన్, భారత్‌లోని తన ప్లాంట్ల నుంచి చైనాకు చెందిన ఉద్యోగులను వెనక్కి పంపించే ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ పరిణామం భారత్‌లో ఐఫోన్ తయారీ భవిష్యత్తుపై ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం, దక్షిణ భారతదేశంలోని ఫాక్స్‌కాన్ ఐఫోన్ ప్లాంట్లలో పనిచేస్తున్న చైనా ఉద్యోగులను తిరిగి తమ దేశానికి వెళ్ళిపోవాలని యాజమాన్యం ఆదేశించింది. గత రెండు నెలలుగా ఈ ప్రక్రియ కొనసాగుతోందని, ఇప్పటికే దాదాపు 300 మంది చైనా నిపుణులు భారత్‌ను విడిచి వెళ్లారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కేవలం సహాయక సిబ్బందిలో కొందరు మాత్రమే ఇక్కడ మిగిలి ఉన్నట్లు సమాచారం.

అయితే, ఈ నిర్ణయం వెనుక కచ్చితమైన కారణం ఏమిటనేది ఫాక్స్‌కాన్ అధికారికంగా వెల్లడించలేదు. కానీ, తమ దేశంలోని కంపెనీలు టెక్నాలజీ, నైపుణ్యం కలిగిన కార్మికులను భారత్, వియత్నాం వంటి దేశాలకు తరలించడాన్ని నిరుత్సాహపరిచేందుకు చైనా ప్రభుత్వం ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తయారీ కంపెనీలు చైనా నుంచి బయటకు తరలిపోకుండా అడ్డుకునే వ్యూహంలో ఇది భాగం కావచ్చని కథనాలు వస్తున్నాయి.

ప్రస్తుతం యాపిల్ ఏటా తయారుచేసే ఐఫోన్లలో సుమారు 15 శాతం (40 మిలియన్ యూనిట్లు) భారత్‌లో ఉత్పత్తి అవుతున్నాయి. త్వరలో విడుదల కానున్న ఐఫోన్ 17 ఉత్పత్తిని భారత్‌లో భారీగా పెంచాలని యాపిల్ భావిస్తోంది. ఇలాంటి కీలక సమయంలో చైనా నిపుణులు వెనుదిరగడం ఉత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

చైనా సిబ్బందిని వెనక్కి పిలవడం వల్ల స్థానిక కార్మికులకు శిక్షణ ఇవ్వడం, తయారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా నుంచి బదిలీ చేసే ప్రక్రియ నెమ్మదించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. దీనివల్ల ఉత్పత్తి వ్యయం పెరిగే ప్రమాదం ఉందని వారు అంచనా వేస్తున్నారు. "ఈ నిర్ణయం వల్ల భారత్‌లో ఉత్పత్తి నాణ్యతపై ప్రభావం పడకపోవచ్చు, కానీ అసెంబ్లీ లైన్‌లో సామర్థ్యం కచ్చితంగా తగ్గుతుంది" అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఒకరు చెప్పినట్లు నివేదిక పేర్కొంది.

 

Author

Shakir Babji Shaik

Editor | Amaravathi

WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now