ANDHRAPRADESH:ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టులకు రంగం సిద్ధమైంది. ఈ రెండు నగరాల్లో మొత్తం రూ. 21,616 కోట్ల వ్యయంతో ఈ రెండు మెట్రో ప్రాజెక్టులను అమలు చేయాలని నిర్ణయించారు. అందుకు గాను రేపటినుంచి ఈ ప్రాజెక్టుల కోసం అధికారికంగా టెండర్లను పిలవనున్నారు. దీంతో ఏపీలో ఆధునిక రవాణాకు మరో ముందడుగు పడిందని భావిస్తున్నారు. ఎంపికైన కంపెనీలకు కాంట్రాక్టులు ఇవ్వబడతాయి. మొత్తం 5 సంవత్సరాల్లో ప్రాజెక్టులను పూర్తిచేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
నిధుల కేటాయింపు..
విజయవాడ మెట్రో రైలుకు రూ. 10,118 కోట్లు.. వైజాగ్ మెట్రో రైలుకు రూ. 11,498 కోట్లు కేటాయించారు. ఈ రెండు ప్రాజెక్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50 శాతం నిధుల భాగస్వామ్యాన్ని వహించనున్నాయి. కాగా రాష్ట్ర ప్రభుత్వ వాటాలో భాగంగా వైజాగ్ మెట్రో ప్రాజెక్టుకు రూ. 4,101 కోట్లు విశాఖ మెట్రో రీజినల్ డెవలప్‌మెంట్ అథారిటీ (VMRDA) ద్వారా సమకూర్చనున్నారు. విజయవాడ మెట్రో రైలుకు రూ. 3,497 కోట్లు కాపిటల్ రీజినల్ డెవలప్‌మెంట్ అథారిటీ (CRDA) ద్వారా రాష్ట్రం సమకూర్చనుంది.
విజయవాడ మెట్రో మార్గాలు..
విజయవాడ మెట్రో ప్రాజెక్టు సుమారు 55 కిలోమీటర్ల మేర ప్లాన్ చేస్తున్నారు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ (PNBS) టూ గన్నవరం ఎయిర్‌పోర్ట్, బెంజ్ సర్కిల్ టూ వడ్లపూడి, విజయవాడ టూ ఉల్లిపాయల రోడ్డు వంటి ముఖ్య మార్గాలను ప్రణాళికలో చేర్చారు. ఈ మార్గాలు విమానాశ్రయం, రైల్వే స్టేషన్, బస్టాండ్లతో సమన్వయం కలిగించేలా ప్రత్యేకంగా రూపొందించారు.
వైజాగ్ మెట్రో మార్గాలు..
విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు మూడు కారిడార్లలో రూపకల్పన చేశారు. మొత్తం సుమారు 75 కిలోమీటర్ల మేర ఉండే ఈ మార్గంలో గాజువాక - రుషికొండ - భీమ్‌లిపట్నం, కుర్మన్నపాలెం - పీఎంవీ బీచ్, నాడ్ జంక్షన్ - ఎయిర్‌పోర్ట్ మార్గాలు ప్రధాన రూట్లుగా నిర్ణయించారు.
ప్రాజెక్టుల ప్రత్యేకతలు..
అన్ని స్టేషన్లలో స్మార్ట్ టికెటింగ్ సిస్టమ్, డిజిటల్ పేమెంట్లు అమలు.
సీసీటీవీ కెమెరాలు, బయోమెట్రిక్ సెక్యూరిటీ, డ్రోన్ సర్వైలెన్స్ వంటి ఆధునిక భద్రతా సదుపాయాలు.
స్టేషన్ల వద్ద కామర్షియల్ కాంప్లెక్స్‌లు, షాపింగ్, పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు.
ట్రాఫిక్ నియంత్రణతో పాటు రియల్ ఎస్టేట్ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం ఈ ప్రాజెక్టుల ముఖ్య ప్రయోజనాలు.