Hyderbada:ఇంకా చెప్పాలంటే.. అసెంబ్లీకి కూడా కేసీఆర్ రావాలని కోరుకునేవారు చాలా మంది ఉన్నారు. రావడమే కాదు.. ప్రజల సమస్యలపై స్పందించాలని కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు.
త్వరలోనే ప్రెస్ మీట్ పెడతానని బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. కాంగ్రెస్‌ను కడిగేస్తానని కూడా వ్యాఖ్యానించారు. తమపై చేస్తున్న దుష్ప్రచారం.. తమ నాయకులపై పెడుతున్న కేసుల వంటి అంశాలను ప్రస్తావిస్తానని ఆయన చెప్పారు. ఆసుపత్రిలో పార్టీ నాయకులతో భేటీ అయిన కేసీఆర్.. ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. మంచిదే.. కేసీఆర్ మీడియా ముందుకు రావాలనే అందరూ కోరుకుంటున్నారు.
ఇంకా చెప్పాలంటే.. అసెంబ్లీకి కూడా కేసీఆర్ రావాలని కోరుకునేవారు చాలా మంది ఉన్నారు. రావడమే కాదు.. ప్రజల సమస్యలపై స్పందించాలని కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక, ప్రెస్ మీట్‌లో తాను ఏం మాట్లాడాలని అనుకుంటున్నది చూచాయగా కేసీఆర్ చెప్పినట్టు తెలిసింది. ప్రధానంగా కాళేశ్వరంతో పాటు.. ఫోన్ ట్యాపింగ్, బనకచర్ల వ్యవహారాలను ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలోని లోపాలను కూడా ఆయన చెప్పే అవకాశం కనిపిస్తోంది
అయితే.. ఇక్కడితోనే కేసీఆర్ ప్రెస్‌మీట్‌కు పరిమితమైతే.. అది అసంపూర్ణమే అవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. నిజంగానే కేసీఆర్ మీడియా ముందుకు వస్తే.. ఆయన చెప్పాల్సిన విషయాలు చాలానే ఉన్నాయని అంటున్నారు. ప్రధానంగా తన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత రాసిన `డియర్ డాడీ` లేఖ.. అనంత ర పరిణామాలపై ఆయన స్పందించాల్సి ఉంది. అలానే.. పార్టీలో నెంబర్ 2 ఎవరు? తన వారసత్వం ఎవరికి వస్తుందన్న విషయాన్ని కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.
మరీ ముఖ్యంగా క్షేత్రస్థాయిలో తెలంగాణ జాగృతి తరఫున నిర్వహిస్తున్న కార్యక్రమాలు తనకుతెలిసే చేస్తున్నారో.. లేదో కూడా చెప్పాలి. ఇవన్నీ ఒక ఎత్తయితే.. మరో ముఖ్య ఘట్టం.. బీజేపీతో దోస్తీ విషయంపై సొంత కుమార్తె చెప్పిన వ్యాఖ్యల్లో నిజానిజాలను కూడా కేసీఆర్ వెల్లడించక తప్పదు. బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు లేదా విలీనం చేసేందుకు చర్చలు జరిగాయని.. తాను జైల్లో ఉన్నప్పుడు.. ఈ ప్రతిపాదన వచ్చిందని కవిత చెప్పిన విషయం తెలిసిందే.
ఇప్పుడు కేసీఆర్ నిజంగానే మీడియా ముందుకు వస్తే.. ఈ విషయాన్ని తేల్చాల్సి ఉంటుంది. అలా కాకుండా.. కేవలం కాంగ్రెస్‌ను టార్గెట్ చేసుకుని.. సొంత విషయాలను విస్మరిస్తే.. అది ఆయనకే కాదు.. ఆయన రాజకీయాలకు శోభనివ్వదన్న వాదన బలంగా వినిపిస్తోంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi