Hot Posts

6/recent/ticker-posts

ఏపీలో జడ్జీలకు హైకోర్టు సంచలన ఆదేశాలు..! సోషల్ పోస్టులకు రిమాండ్లపై ..!


ANDHRAPRADESH:ఏపీలో రాజకీయ పార్టీల మధ్య సాగే పోరులో భాగంగా తమ ప్రత్యర్థులపై, ప్రభుత్వంపై సోషల్ మీడియా పోస్టులు కలకలం రేపుతున్న వేళ హైకోర్టు తాజాగా రాష్ట్రంలోని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్లకు కీలక ఆదేశాలతో కూడిన హెచ్చరికలు జారీ చేసింది. సోషల్ మీడియా పోస్టులు పెట్టారనే కారణంతో ముందూ వెనుకా చూసుకోకుండా నిందితులకు రిమాండ్లు విధిస్తున్న న్యాయమూర్తులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ సర్కులర్ ఇచ్చింది.

సోషల్ మీడియా పోస్టుల విషయంలో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్లు ఇష్టారాజ్యంగా రిమాండ్లు విధించడాన్ని తప్పుబడుతూ హైకోర్టు రిజిస్ట్రార్ వారికి సర్కులర్ జారీ చేశారు. ఇందులో సోషల్ మీడియా పోస్టుల కేసుల్లో సుప్రీంకోర్టు గతంలో నిర్దేశించిన సూత్రాలు పాటించడం లేదని ఆక్షేపించారు. గతంలో సుప్రీంకోర్టు ఆర్నేష్‌ కుమార్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ బీహార్‌ కేసుతో పాటు ఇమ్రాన్ ప్రతాప్ గఢీ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసుల్లో ఇచ్చిన తీర్పుల్ని పాటిస్తూ రిమాండ్లపై ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టు వారికి సూచించింది.

ముఖ్యంగా ప్రాథమిక విచారణ లేకుండా ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయొద్దని తెలిపింది. అలాగే రిమాండ్‌కు ఆదేశించే ముందు పోలీసులు చట్టాన్ని పాటించారా..?లేదా.? అనేది మెజిస్ట్రేట్‌లు చూడాలని ఆదేశించింది. అలాగే హైకోర్టు జారీ చేసిన సర్క్యులర్‌ కచ్చితంగా అమలు చేయాలని కూడా ఆదేశించింది. ఇందులో 3 నుంచి 7 సంవత్సరాల శిక్ష ఉన్న కేసుల్లో, విచారణ అధికారి ముందుగా ప్రాథమిక విచారణ జరపాలని, ఈ కేసు విచారణను 14 రోజుల లోపు పూర్తి చేయాల్సిందేనని తెలిపింది

ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే డీఎస్పీ స్థాయి అధికారి అనుమతి తప్పనిసరి అని హైకోర్టు మెజిస్ట్రేట్లకు తెలిపింది. మేజిస్ట్రేట్లు ఈ ఆదేశాలను అతిక్రమిస్తే తాము తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరింెచింది. ఈ విషయంలో వారు శాఖాపరమైన విచారణ కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. హైకోర్టు జారీ చేసిన సర్కులర్ ప్రకారం మానవ హక్కుల పరిరక్షణతో పాటు ఆచరణలో పోలీసులు, న్యాయవ్యవస్థ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఏపీ హైకోర్టు వెల్లడించింది.

Author

Shakir Babji Shaik

Editor | Amaravathi