HYDERABAD:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు తొందరగా వచ్చినప్పటికీ ఇప్పటివరకు ఆశించిన మేరకు వర్షాలు కురవలేదు ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. వర్షాలు కురవాలని కప్పతల్లి పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్నటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
నాలుగు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు
తెలంగాణలో ఇక విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి రుతుపవనాలు తిరిగి యాక్టివ్ అయ్యాయని మరో ఉపరితల ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని అదే కనుక జరిగితే భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. రాబోయే నాలుగు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవనున్నట్టు తెలిపారు.
దక్షిణ తెలంగాణ జిల్లాలలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఋతుపవన ద్రోణి, దక్షిణ కోస్తా మీదుగా కొనసాగుతున్న ఉపరితల చక్రవాక ఆవర్తనం, నేడు తెలంగాణ తీరానికి దగ్గరగా ద్రోణి రావడం వల్ల భారీ వర్షాలకు చాన్స్ ఉందని తెలిపారు . దక్షిణ తెలంగాణ జిల్లాలలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు.
హైదరాబాద్ లో భారీ వర్షం
హైదరాబాద్ సిటీలో కూడా నేడు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు హెచ్చరించింది. నేడు మరికొన్ని గంటల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బీరంగూడ, ఆర్‌సీ పురం, మియాపూర్, సేరిలింగంపల్లి, చంద్రాయణగుట్ట, హయత్‌నగర్, బాలాపూర్, షంషాబాద్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో చెదురుమదురుగా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణకేంద్రం అధికారులు చెప్పారు.
ఈ జిల్లాలలో భారీ వర్షాలు
వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.నేడు రాష్ట్రంలోని రంగారెడ్డి, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, రాష్ట్రంలో అన్ని జిల్లాలలో అక్కడక్కడ 30నుంచి 40కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది.
అన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్
ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. మరోవైపు రేపు రాష్ట్రంలోని రంగారెడ్డి, సంగారెడ్డి, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో వర్షాలు కురుస్తుండగా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.