వైసీపీ అధినేత జగన్ గుండె చాలా గట్టిది. ఆయన ట్రెడిషనల్ పొలిటీషియన్ కాదు. ఆ మాదిరి అసలు ఆలోచించరు.
వైసీపీ అధినేత జగన్ గుండె చాలా గట్టిది. ఆయన ట్రెడిషనల్ పొలిటీషియన్ కాదు. ఆ మాదిరి అసలు ఆలోచించరు. ఒకరి మీద చర్యలు తీసుకుంటే ఏమి జరుగుతుంది పరిణామాలు ఏమిటి అన్నది అసలు పట్టించుకోరు. తనతో ఉంటే తన మాట వినాలి. తాను చెప్పిన ఆదేశాలను పాటించాలి. కాదు అనుకుంటే ఇక వీధి తలుపు చూపించడమే.
లెక్క తెలియదు కానీ ఒక రాజకీయ పార్టీ నుంచి ఎక్కువ మంది వెళ్ళిపోయిన నేతలు కానీ పంపించేసిన వారు కానీ చూస్తే కనుక వైసీపీ అందులో రికార్డు బద్ధలు కొడుతుంది అని అంటున్నారు. వైసీపీ మొత్తం రాజకీయ జీవితం 15 ఏళ్ళు. ఈ షార్ట్ టెర్మ్ లో పార్టీలో పునాదుల నుంచి ఉన్న వారు ఎందరు అంటే జవాబు కష్టమే.
అయితే వైసీపీలో నేతల పోకడల వల్ల కూడా వేటు పడుతోంది అని అంటున్నారు. వైసీపీ ఓటమి పాలు అయి పదమూడు నెలలు అయింది. కానీ పార్టీ నేతల తీరులో మార్పు లేదని అంటున్నారు. చాలా మంది నేతలు ఇంకా ఇంటి గడప దాటలేదు. అంతే కాదు వర్గ పోరు కూడా వీడని నేతలు ఉన్నారు పార్టీకి మేమే దిక్కు అని అతి ధీమా పడుతున్న వారూ ఉన్నారు.
ఎన్నికల ముందు హడావుడి చేస్తే చాలు ఇప్పటి నుంచి ఎందుకు అని రిలాక్స్ అవుతున్న నేతలు కూడా ఉన్నారు. అధికార కూటమి నేతలతో చెట్టాపట్టాలు వేసుకుని మరీ వ్యాపారాలు వ్యవహారాలు చేసుకుంటూ వైసీపీ అధినాయకత్వం ఇచ్చిన పిలుపులను పక్కన పెడుతున్న వారూ ఉన్నారు. వీరందరికీ ఒక హెచ్చరికగా జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. హిందూపురంలో ఇద్దరు సీనియర్ నేతల మీద వేటు వేసి పార్టీ నుంచి బయటకు పంపించిన తీరుని చూసిన వారు వైసీపీలో ఇదే చర్చించుకుంటున్నారు
మొదటి నుంచి ఉన్న వారు సీనియర్లకే ఇలా అయితే మరి మిగిలిన వారి సంగతేంటి అని కూడా పార్టీలో చర్చ సాగుతోంది. వైసీపీలో ఈ రోజున చూస్తే చాలా మంది రిలాక్స్ మూడ్ లో ఉన్నారు. చెప్పాల్సినవి చెప్పారు. వినాల్సినవి విన్నారు ఇక యాక్షన్ లోకి దిగడమే అని జగన్ నిర్ణయానికి వచ్చారా అన్నది అయితే అంతా ఆలోచిస్తున్నారు.
పార్టీలో నేను ఒక్కడినే మొదట ఉన్నాను. నాతోనే స్టార్ట్ అయింది ఇంతగా ముందుకు వచ్చింది. నాతో ఎవరు నడిస్తే వారు పార్టీలో ఉంటారు. అలా కాని వారు ఎంతటి వారు అయినా వెళ్ళిపోవచ్చు అని జగన్ తరచూ చెబుతూనే ఉన్నారు. దాంతో సీనియర్లు అయినా మరెవరు అయినా జగన్ అసలు స్పేర్ చేయరని అంటున్నారు
ఇది ఆరంభం మాత్రమే అని అంటున్నారు. హిందూపురంతో మొదలెట్టి రాయలసీమ నుని కోస్తా జిల్లాలు గోదావరి జిల్లాల మీదుగా ఉత్తరాంధ్రా వైపు వస్తారని అంటున్నారు. ఎవరెవరు అధికార పార్టీ నేతలతో కలసి తిరుగుతున్నారు ఎవరు పార్టీని పట్టించుకోవడం లేదు, ఎవరు వైసీపీని పూర్తిగా గాలికి వదిలేశారు వంటి వివరాలు అన్నీ జగన్ వద్ద ఉన్నాయని చెబుతున్నారు. తాజాగా ఝలిపించిన కొరడాతో వారు తీరు మార్చుకోకపోతే వైసీపీలో వరసబెట్టి వేటు పడే సీన్లే కనిపిస్తాయని అంటున్నారు. దాంతో వైసీపీ నేతలకు హెచ్చరిక అని చెబుతున్నారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi