ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలు
తీవ్రంగా స్పందించిన మంత్రి నారా లోకేశ్
మహిళల వ్యక్తిత్వాన్ని కించపరచడం దారుణమన్న లోకేశ్
వైసీపీ నేతలు కూడా జగన్ దారిలోనే నడుస్తున్నారని వ్యాఖ్యలు
మహిళల జోలికొస్తే సహించేది లేదని హెచ్చరిక
ANDHRAPRADESH::టీడీపీ మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహిళల జోలికి వస్తే సహించే ప్రసక్తే లేదని, ఇది జగన్ రెడ్డి జంగిల్ రాజ్ కాదని.. మహిళలకు అండగా నిలిచే ప్రజా ప్రభుత్వమని ఆయన స్పష్టం చేశారు.
ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. "వైసీపీ నాయకులకు మహిళలంటే ఇంత ద్వేషభావమా? పెద్ద పెద్ద చదువులు చదివితే సరిపోదు, కనీస ఇంగితజ్ఞానం కూడా ఉండాలి" అని లోకేశ్ చురకలంటించారు. ఒక మహిళా ఎమ్మెల్యేపై బహిరంగంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం నేరమని, దారుణమని ఆయన పేర్కొన్నారు.
వారి అధినేత జగన్ రెడ్డిని వైసీపీ నేతలు ఆదర్శంగా తీసుకున్నట్లున్నారని లోకేశ్ విమర్శించారు. కన్నతల్లిని, చెల్లిని బయటకు పంపిన నాయకుడి దారిలోనే వారు నడుస్తున్నారని ఆరోపించారు. ఆడవారిపై అవాకులు చెవాకులు పేలితే చూస్తూ ఊరుకోవడానికి ఇది పాత ప్రభుత్వం కాదని, మహిళల గౌరవానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యల వీడియోను కూడా పంచుకున్నారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi