ANDHRAPRADESH:డా బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో: ఆలమూరు లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాక్షేమ నాయకుడిగా సంస్కరణల రూపశిల్పిగా చిరస్థాయిగా నిలిచిన దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలు మండల కేంద్రమైన ఆలమూరు బస్ స్టాండ్ సెంటర్లో వైసిపి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముందుగా రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈసందర్భంగా వైఎస్ఆర్సిపి నాయకులు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకుంటే గుర్తొచ్చే ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ ఫీజు రీయింబర్స్‌మెంట్ రైతులకు సాగునీటి సౌకర్యం వంటి పేదల సంక్షేమ పథకాలు గుర్తుకు వస్తాయని అన్నారు. ఆయన పరిపాలనలో ప్రవేశపెట్టిన సంస్కరణలు ఆంధ్రప్రదేశ్‌ను సంక్షేమ రాష్ట్రంగా మార్చాయని, ఈ రోజు అనేక పార్టీలు ఆయన పథకాలనే అనుసరిస్తున్నాయని, కొత్త పథకాలు తీసుకురావడంలో విఫలమవుతున్నాయని విమర్శించారు.
వైఎస్ఆర్ పరిపాలన పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని, ఆయన రైతు సంక్షేమం కోసం చేపట్టిన జలయజ్ఞం, విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్, పేదల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ఆయన మానవీయ దృక్పథాన్ని, ప్రజల పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధతను తెలియజేస్తాయని కొనియాడారు. "వైఎస్ఆర్ ఒక నాయకుడు మాత్రమే కాదు, పేదల ఆశయాలకు గొంతుక, రైతులకు బంధువు, విద్యార్థులకు మార్గదర్శి" అని వక్తలు గుర్తు చేశారు. అనంతరం ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Vijaya Babu. I
Staff Report | Konaseema