Hot Posts

6/recent/ticker-posts

రేవంత్ ఏరి కోరి తెచ్చుకున్న టీం.. ప్రతిపక్షం చేతికి అస్త్రం..!?


HYDERABAD:ముఖ్యమంత్రి రేవంత్ దూసుకు పోవాలని ప్రయత్నిస్తున్నారు. తన ఆలోచనలకు తగినట్లుగా పరిగెత్తేందుకు ఏరికోరి సొంత టీంను ఏర్పాటు చేసుకున్నారు. పాలన మొదలు పెట్టి 20 నెలలు పూర్తి అవుతోంది. ఇప్పుడు ప్రభుత్వం అంటే రేవంత్ ఒక్కరే అన్నట్లుగా పరిస్థితి మారింది. సీఎం తన మార్క్ చూపించేందుకు ఎంచుకున్న వారు మాత్రం తమ సీటు తమకు ఉంటే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు మాత్రమే కాదు.. రేవంత్ సొంతగా కీలక బాధ్యతలు అప్పగించిన వారి తీరు పైన సొంత పార్టీ నుంచే అసంతృప్తి వ్యక్తం అవుతోంది. వీరి అసమర్థతే ప్రతిపక్షాలకు బలంగా మారుతోంది.

అంచనాలకు భిన్నంగా

రేవంత్ ఎన్నికల్లో గెలవగానే తన అంచనాల మేరకు పని చేస్తారనే నమ్మకంతో ఒక వ్యవస్థను నిర్మించుకున్నారు. అందులో ఐఏఎస్.. ప్రభుత్వ అధికారుల పని తీరు పక్కన పెడితే.. ఇతర బాధ్యతలు స్వీకరించిన వారు మాత్రం ఏ మాత్రం అంచనాలకు తగినట్లుగా పని చేయటం లేదనే అభిప్రాయం పార్టీలో వినిపిస్తోంది. మంత్రుల్లో నలుగురైదుగురు మినహా మరెవరూ యాక్టివ్ గా ప్రభుత్వ సక్సెస్.. పార్టీ వాయిస్ వినిపించేందుకు ముందుకు రావటం లేదు. బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష పార్టీల పై దూకుడుగా వ్యవహరించే వారు. ప్రజా ప్రభుత్వంగా చెప్పుకునే రేవంత్ పాలనలో దూకుడుగా వెళ్లకపోయినా.. ప్రతిపక్షాలను కౌంటర్ చేసే వారే కరువయ్యారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న వ్యతిరేక ప్రచారమే బలంగా ప్రజల్లోకి వెళ్తుందని పార్టీ నేతలు ఇప్పటికీ వాపోతున్నారు.

ప్రతిపక్షానికి అయుధంగా

ఒక విధంగా రేవంత్ టీం వైఫల్యాలే ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీకి అస్త్రాలుగా మారుతున్నాయి.సోషల్ మీడియాలో బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న ప్రచారానికి ధీటుగా కాంగ్రెస్ నుంచి స్పందన ఉండటం లేదు. పార్టీ నిర్వహించే సోషల్ మీడియా టీం మినహా... ప్రభుత్వంలో మీడియా వ్యవహారాలు చూస్తున్న వారు ప్రభుత్వం పైన వస్తున్న విమర్శలను తిప్పి కొట్టే బాధ్యత సమర్ధవంతంగా నిర్వహించం లేదని సొంత ఎమ్మెల్యేల్లోనే చర్చ జరుగుతోంది. మంత్రులు శాఖల వారీగా ఏం చేస్తున్నారో కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలకే సమాచారం ఉండటం లేదు. ప్రభుత్వంలో జరుగుతున్న నిర్ణయాలు సొంత పార్టీ .. ప్రజల కంటే ముందుగా ప్రతిపక్ష పార్టీలకు తెలుస్తోందని చెబుతు న్నారు. ప్రతిపక్షంలో ఉన్నా.. వారు అంత సమర్ధవంతంగా తమ వ్యవస్థలను కొనసాగిస్తున్నారు. అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను గుర్తించి.. వారు ఓపెన్ కామెంట్స్ చేయకుండా వారించటం లోనూ రేవంత్ నమ్ముకున్న టీం వైఫల్యం కనిపిస్తోంది.

మారని పాత వాసనలు

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతుంది. సీఎం రేవంత్ పాల్గొనే సభలు.. సమీక్షలకు సైతం అంతంత మాత్రపు ప్రచారమే వస్తోంది. కాంగ్రెస్‌లో బలమైన వాయిస్ ప్రస్తుతానికి రేవంత్‌కు మాత్రమే ఉంది. పాలనలో.. పార్టీలో రేవంత్ మాట్లాడేదే అంతంత మాత్రంగా ప్రజల్లోకి వెళ్తే.. మరి, మంత్రుల మాట ఏంటి. ఇదే ప్రశ్న వారి అంతర్గత చర్చల్లో వ్యక్తం అవుతోంది. రేవంత్ గత ప్రభుత్వం కంటే మంచి నిర్ణయాలు తీసుకుంటున్నా అవి ప్రజల్లోకి వెళ్లటం లేదు. ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారం మాత్రం వేగంగా వెళ్తోంది. ఎక్కడ లోపం. ప్రతిపక్షాల సమర్థతా.. రేవంత్ ఏరి కోరి తెచ్చుకున్న బాధ్యుల అసమర్థతా..? పోస్టుల్లో ఉన్నామనే దర్పం మినహా.. ఏ విధంగా వీరంతా రేవంత్ కోసం.. ప్రభుత్వం కోసం పని చేస్తున్నారనేది సందేహంగానే కనిపిస్తోంది. మరి.. రేవంత్ ఇలాంటి వారినే నమ్ముకొని ముందుకు వెళ్తారా.. ఏం చేస్తారనేది వేచి చూడాల్సిందే.