ANDHRPRADESH:శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఎంతోకాలంగా హిందువులందరూ పాటిస్తున్న ఆచారం. వరలక్ష్మీ వ్రతం చాలా విశేషమైనది గా, మహిళలందరూ సౌభాగ్యాల కోసం, సిరిసంపదల కోసం, భర్త శ్రేయస్సును ఆశిస్తూ వరాలిచ్చే చల్లని తల్లి అయిన వరలక్ష్మీ దేవిని వ్రతం ద్వారా పూజిస్తారు అని చెబుతారు .
పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వరలక్ష్మీ వ్రతాన్ని చాలా విశేషంగా జరుపుకుంటారు. ఇక అటువంటి వరలక్ష్మీ వ్రతం కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగితే, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా చేసుకుంటే మహిళలకు అంతకంటే కావలసింది ఏముంటుంది. ఇక అటువంటి అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది టిటిడి.
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో వ్రతంలో పాల్గొనాలంటే
తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతంలో పాల్గొనాలని భావించేవారు జూలై 31వ తేదీన ఉదయం 9 గంటలకు టికెట్లు తీసుకోవడానికి ఆన్ లైన్లో ప్రయత్నం చేయవచ్చని టిటిడి నేడు ఒక ప్రకటనలో పేర్కొంది. భక్తులు నేరుగా వ్రతంలో పాల్గొనేందుకు జూలై 31న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో 150 టికెట్లు జారీ చేస్తారు.
వరలక్ష్మీ వ్రతానికి టికెట్లు
అదేవిధంగా ఆలయం సమీపం కౌంటర్‌లో ఆగస్టు 7న ఉదయం 9 గంటలకు కరెంట్ బుకింగ్‌లో 150 టికెట్లు విక్రయిస్తారు. రూ.1000/- చెల్లించి భక్తులు టికెట్ కొనుగోలు చేయవచ్చు. ఒక టికెట్‌పై ఇద్దరు గృహస్తులను అనుమతిస్తారు.ఆగస్టు 8వ తేదీన ఆస్థానమండపంలో శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరలక్ష్మీవ్రతం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీపద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఈ సేవలు రద్దు
ఈ వ్రతాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇక వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయంలో అభిషేకం, అభిషేకానంతర దర్శనం , లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రేక్ దర్శనం, వేద ఆశీర్వచనం సేవలను టిటిడి రద్దు చేసింది. ఇక వరలక్ష్మీ వ్రతాన్ని ఈసారి స్పెషల్గా తిరుమల శ్రీవారి సన్నిధిలో జరుపుకోవాలని టిటిడి ఇస్తున్న ఈ సువర్ణ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి.