Hyderabad:తెలంగాణ లో రాజకీయంగా ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత కేసు పైన నేడు సుప్రీంకోర్టు తీర్పు వెలువ రించనుంది. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల పై చర్యలు తీసుకోవాలని సుప్రీంలో బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటీషన్ పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈ రోజు సుప్రీంకోర్టు ఈ కేసులో తుది తీర్పు వెలువరించనుంది. దీంతో, సుప్రీం ధర్మాసనం తీర్పు పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
నేడే జడ్జిమెంట్
తెలంగాణలో కొంత కాలంగా కోర్టుల్లో కొనసాగుతున్న ఎమ్మెల్యేల అనర్హత అంశం పైన ఈ రోజు సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనుంది. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం నేడు ఇవ్వనున్న తీర్పు పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది. బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు పది మంది పార్టీ ఫిరాయించారంటూ దాఖలైన పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీంకోర్టులో జనవరి 15న స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.
అనర్హత వేయాలంటూ
అదే రోజు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, టీ ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్ పార్టీ ఫిరాయించారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కౌశిక్ రెడ్డి, వివేకానంద, జీ జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింత ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఆ తర్వాత వాదనలు జరుగుతుండగానే మార్చి 18న బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్‌ను ప్రతివాదిగా చేర్చారు. ఆ పిటిషన్లు అన్నింటినీ కలిపి విచారించిన జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఏప్రిల్ 3న తీర్పును రిజర్వ్ చేసింది. జస్టిస్ గవాయ్ ప్రస్తుతం సీజేఐగా ఉన్నారు.
తీర్పు పై ఉత్కంఠ
గతంలో ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీం కోర్టులో విచారణలో ఉన్న ఎమ్మెల్యేల అనర్హత అంశాన్ని సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రస్తావించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి సంయమనం పాటించలేరా.. ఉప ఎన్నికలు రావని అసెంబ్లీ వేదికగా సీఎం ఎలా చెబుతారని ప్రశ్నించారు. అలాగే, అసెంబ్లీ స్పీకర్ కాలయాపనపైనా అసహనం వ్యక్తం చేశారు. నాలుగేళ్లు స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా చూస్తూ ఊరుకోవాలా అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఈ రోజు తీర్పు ఎలా ఉంటుందనే ఉత్కంఠ రాజకీయంగా కొనసాగుతోంది.