ANDHRAPRADESH:తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ వ్యవస్ధాపక సభ్యుల్లో ఒకరైన పూసపాటి అశోక్ గజపతిరాజు ఇవాళ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో పాటు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు కూడా పంపించారు. ఈ మేరకు తన రాజీనామాను ఆమోదించాలని ఈ లేఖల్లో అశోక్ గజపతిరాజు పార్టీ అధిష్టానాన్ని కోరారు.
తాజాగా గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజును కేంద్రం నియమించింది. దీంతో ఆయన త్వరలో బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీకి తప్పనిసరిగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అశోక్ తన రాజీనామాను అధికారికంగా సమర్పించారు. గోవా గవర్నర్ గా రాజకీయాలకు అతీతంగా పని చేయాల్సి ఉన్నందున తెలుగు దేశం పార్టీతో తన సుదీర్ఘ అనుబంధాన్ని ఆయన తెగతెంపులు చేసుకున్నారు.
తెలుగు దేశం పార్టీతో పాటు పార్టీ పొలిట్ బ్యూరోకు కూడా రాజీనామా చేస్తున్నట్లు అశోక్ గజపతిరాజు అధినేత చంద్రబాబుకు పంపిన లేఖలో పేర్కొన్నారు. పార్టీ పొలిట్ బ్యూరోలో పని చేసేందుకు తనకు అవకాశం కల్పించినందుకు, తద్వారా పార్టీతో పాటు ప్రజలు, దేశానికి సేవ చేసేందుకు అవకాశం కల్పించినందుకు చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ లేఖ కాపీని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి కూడా ఆయన పంపారు.
1982లో ఎన్టీఆర్ టీడీపీ స్ధాపించినప్పుడు విజయనగరం రాజుగా ఉన్న అశోక్ గజపతిరాజు పార్టీలో చేరారు. అప్పటి నుంచి వరుసగా 43 ఏళ్ల పాటు ఆయన టీడీపీలోనే కొనసాగారు. అలాగే మధ్యలో 2004లో మినహా వరుసగా విజయనగరం ఎమ్మెల్యే, ఎంపీగా గెలుస్తూ వచ్చారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రిగా కొనసాగారు. విలువలతో కూడిన, మర్యాదపూర్వక రాజకీయాలు చేస్తూ వచ్చిన అశోక్ గజపతిరాజు పదవుల కోసం కూడా ఏనాడూ లాబీయింగ్ చేసింది లేదు. ఆయన్నే పదవులు వెతుక్కుంటూ వచ్చాయి. చివరికి గోవా ప్రథమ పౌరుడిగా (గవర్నర్) పదవి ఆయనకు దక్కింది.

Shakir Babji Shaik
Editor | Amaravathi