సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో గల సిగాచి క్లోరో కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ లో సంభవించిన పేలుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. దిగ్భ్రాంతికి గురిం చేసింది. ఈ దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య అమాంతం పెరిగింది. 37కు చేరుకుంది. మరో 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 10 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.
జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు, హైడ్రా, రాష్ట్ర అగ్నిమాపక సిబ్బంది రాత్రంతా సహాయక చర్యలను కొనసాగించాయి. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్న కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. శిథిలాల నుంచి మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు.
ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. ఇంకాస్సేపట్లో ఆయన పాశమైలారానికి బయలుదేరి వెళ్లనున్నారు. పేలుడు సంభవించిన ప్రదేశాన్ని తిలకించనున్నారు. అనంతరం ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శిస్తారు.
సోమవారం మధ్యాహ్నం సిగాచి కెమికల్ ఇండస్ట్రీ రియాక్టర్ లో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. పేలుడు సమయంలో సంఘటన స్థలంలో 90 మంది వరకు కార్మికులు విధి నిర్వహణలో ఉన్నారు. ఈ ఘటనలో 13 మంది కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు
గాయపడ్డ వారిలో వారిని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. పేలుడు ధాటికి రియాక్టర్ ప్రదేశం మొత్తం కుప్పకూలింది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. వారిని వెలికి తీయడానికి జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు, హైడ్రా, రాష్ట్ర అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. రాత్రంతా సహాయక చర్యలను కొనసాగించారు.
సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్న కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. శిథిలాల నుంచి మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు. పేలుడు సంభవించిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పటాన్‌చెరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi