తమ్ముడు పవన్ సినిమా చిత్రీకరణను దగ్గరుండి చూసిన మెగాస్టార్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిరు-పవన్ ఫొటో
అన్నదమ్ములను కలిసి చూసి ఆనందంలో మునిగిన ఫ్యాన్స్
అన్నపూర్ణ స్టూడియోస్‌లో శరవేగంగా కొనసాగుతున్న షూటింగ్
ఏపీ డిప్యూటీ సీఎంగా రాజకీయాల్లో బిజీగా ఉంటూనే, మరోవైపు సినిమాలను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు పవన్ కల్యాణ్. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా సెట్‌కు మెగాస్టార్ చిరంజీవి నిన్న ఆకస్మికంగా విచ్చేసి సందడి చేశారు. తమ్ముడు పవన్ నటనను, చిత్రీకరణ జరుగుతున్న తీరును ఆయన దగ్గరుండి ఆసక్తిగా వీక్షించారు.
హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు హరీశ్ శంకర్, పవన్ కల్యాణ్‌పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో చిరంజీవి సెట్‌లో అడుగుపెట్టారు. పవన్ పక్కనే కూర్చుని, మానిటర్‌లో షాట్‌ను చూస్తున్న చిరంజీవి ఫొటో ఒకటి బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా రోజుల తర్వాత అన్నదమ్ములు ఇద్దరూ ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో పవన్ నిజ జీవితంలో చేసిన ఓ సంచలన సన్నివేశాన్ని దర్శకుడు హరీశ్ శంకర్ రీక్రియేట్ చేస్తున్నట్టు సమాచారం. గతంలో ఓ సందర్భంలో పవన్ కారు టాప్‌పై కూర్చుని ప్రయాణించిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే సీన్‌ను సినిమాలో పెట్టాలని దర్శకుడు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సీన్ కనుక సినిమాలో ఉంటే థియేటర్లలో అభిమానులతో ఈలలు పడటం ఖాయమని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Follow @TeluguChitraalu for more latest updates!#UstaadBhagatSingh #Chiranjeevi #PawanKalyan https://t.co/BSdpOhpxAj pic.twitter.com/qVn56b9T7e
— Telugu Chitraalu (@TeluguChitraalu) July 1, 2025

Shakir Babji Shaik
Editor | Amaravathi