ANDHRAPRADESH:ఆంధ్రప్రదేశ్ లో రోగుల తాజా పరిస్ధితిపై వైద్యారోగ్యమంత్రి సత్యకుమార్ యాదవ్ వివరాలు వెల్లడించారు. ఆయా రోగాల నియంత్రణకు ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యల్ని కూడా ఆయన తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ, ఐపీ సేవల సంఖ్య పెరిగిందని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏయే ప్రాంతాల్లో ఏయే రోగాల ముప్పు ఎక్కువగా ఉంటుందో కూడా మంత్రి వివరించారు.
దేశంలో 33 శాతం మేర గుండెపోటు మరణాలు నమోదు కాగా, ఏపీలో 32 శాతం గుండెపోటు మరణాలు సంభవించినట్లు సర్వేలు చెబుతున్నాయని వైద్యారోగ్యమంత్రి తెలిపారు. కెనడాలో అత్యధికంగా 35 శాతం మేర గుండె పోటు మరణాలు సంభవించినట్లు సర్వేలు చెబుతున్నాయన్నారు. గుండెపోటు మరణాల్ని ఛాలెంజ్ గా తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రివెంటివ్ కార్డియాలజీ పై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో గుండె చికిత్స కు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఒంగోలులో ఇటీవలే క్యాథ్ ల్యాబ్ ను ప్రారంభించామని వైద్యారోగ్యమంత్రి తెలిపారు. గుంటూరు జీజీహెచ్ లో 110 ఓపెన్ హార్ట్ సర్జరీలు, 3 హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయడం అభినందనీయమన్నారు. సమాజంలో రోగాల ముప్పు పెరుగుతున్నందున డాక్టర్లల్లో సేవాభావం పెరగాలన్నారు. యువతలో మానసిక వికాసానికి డాక్టర్లు ప్రధాన భూమిక పోషించాలన్నారు. వైద్యారోగ్యశాఖ చేపట్టిన ఎన్సీడీ 3.O సర్వే 70 శాతం పూర్తయ్యిందని, ఇందులో 45 లక్షల మందికి మధుమేహం, 30 లక్షల మందికి బీపీ ఉన్నట్లు తేలిందన్నారు. 80 శాతం డిసీజ్ బర్డెన్ ఎన్సీడీ వల్లే ఉంటోందన్నారు.
ఎన్సీడీ సర్వేలో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు కూడా బయటపడుతున్నాయని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో లివర్ సంబంధిత కేసులు పెరగడానికి గత ప్రభుత్వ లిక్కరే కారణమన్నారు. ప్రజారోగ్యంపై అప్పటి లిక్కర్ బ్రాండ్లు ఎంతటి తీవ్ర ప్రభావాన్ని చూపించాయో అర్థం చేసుకోవచ్చన్నారు. 2020లో 3400 మంది శ్యాంపిళ్లు పరీక్ష చేయగా 24 శాతం మధుమేం, 28 శాతం హైపర్ టెన్షన్ (బీపీ) కేసులున్నట్లు తెలిసిందన్నారు. ఇవాళ మధుమేహం, బీపీ బాధితులు చాలా ఎక్కువగా ఉండడానికి కారణం ఆహారపు అలవాట్లు, జీవన శైలే కారణమన్నారు
గోదావరి జిల్లాల్లో మధుమేహం బాధితులు, రాయలసీమ జిల్లాల్లో బీపీ బాధితులు పెరుగుతున్నారని మంత్రి తెలిపారు. సిఎం చంద్రబాబు ఆదేశాల మేరకు 10 ప్రధాన వ్యాధులపై దృష్టి పెట్టామన్నారు. ప్రస్తుతమున్న 71 శాతం లైఫ్ ఎక్స్ పెన్టెన్సీని 85 శాతానికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రం లో ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసేందుకు కింది స్థాయి నుండి మ్యాపింగ్ చేస్తున్నామన్నారు. క్యాన్సర్ ను ఎదుర్కొనేందుకు పటిష్టమైన ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించామని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వాసుపత్రుల్లో 8 శాతం మేర ఓపీ, 17 శాతం ఐపీ సేవలు పెరగడం ప్రశంసనీయమన్నారు.