ANDHRAPRADESH:ఏపీలోని మంగళగిరి నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నారా లోకేష్.. ఈ సీటును తన కంచుకోటగా మార్చుకునేందుకు అంది వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఇప్పటికే మంగళగిరిలో ఎలక్ట్రిక్ బస్సుల్ని రాష్ట్రంలో అందరి కంటే ముందుగా ప్రారంభించిన లోకేష్.. ఇప్పుడు మరో విషయంలో అధికారులకు టార్గెట్ పెట్టేశారు. అందుకు 100 రోజుల గడువు కూడా ఇచ్చారు.
రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే మంగళగిరిలో రూడ్లపై గుంతలు ఎక్కువగానే ఉన్నట్లు తాజాగా గుర్తించిన మంత్రి నారా లోకేష్ ఇవాళ అధికారులతో దీనిపై సమీక్ష నిర్వహించారు. దీంతో 100 రోజుల్లో మంగళగిరిని గుంతలు లేని పట్టణంగా మార్చాలని అధికారులకు లోకేష్ టార్గెట్ ఇచ్చారు. మంగళగిరిలో ఎక్కడా రూడ్లపై గుంతలు లేకుండా చూడాలన్నారు. దీన్నో సవాల్ గా తీసుకుని పని చేయాలని అధికారులకు లోకేష్ సూచించారు.
అలాగే స్వచ్ఛత విషయంలో మంగళగిరిని టాప్ లో నిలబెట్టేందుకు ఇవాళ 4.40 కోట్ల రూపాయలతో అత్యాధునిక చెత్త వాహనాలను నారా లోకేష్ ప్రారంభించారు. ఇందులో చెత్తను తరలించేందుకు రెండు రిఫ్యూజ్ కాంపాక్టర్ మెషిన్ వాహనాలు, రెండు స్వీపింగ్ మెషిన్ వాహనాలతో పాటు బీటీ రహదారుల గుంతలు పూడ్చే అధునాతన పాత్ హోల్ రోడ్ రిపేర్ వాహనం కూడా ఉంది. వీటిని ఉండవల్లిలోని తన నివాసం నుంచే లోకేష్ ప్రారంభించారు.
మరోవైపు మంగళగిరిలో గుంతలు లేని రోడ్ల లక్ష్యాన్ని వంద రోజుల్లో సాధించాలని అధికారులకు టార్గెట్ పెట్టిన నారా లోకేష్.. ఆ 100 రోజులు పూర్తయిన తర్వాత ప్రజల నుంచి వీటిపై ఫిర్యాదులు కూడా స్వీకరించాలని మరో ఆదేశం కూడా ఇచ్చారు. అదీ వాట్సాప్ లేదా స్వచ్ఛాంధ్ర యాప్ ద్వారా ఈ ఫిర్యాదులు స్వీకరించేలా చూడాలన్నారు. తద్వారా మంగళగిరిలో రహదారుల విషయంలో ఇకపై ఫిర్యాదులు లేకుండా అధికారులకు టార్గెట్లు ఫిక్స్ చేసేశారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi