ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతల పైన స్పష్టత వచ్చింది. కొత్త పార్టీ చీఫ్ దాదాపు ఖరారయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామి గా ఉన్న బీజేపీ అనేక చర్చల తరువాత ఏపీ పార్టీ అధ్యక్షుడిని ఖరారు చేసింది. ఏపీలో సామాజిక సమీకరణాలే ఓట్ బ్యాంక్ ను నిర్దేశిస్తున్న క్రమంలో భవిష్యత్ రాజకీయాలకు అనుగుణంగా బీజేపీ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. మిషన్ 2029 లక్ష్యంగా కొత్త అధ్యక్షుడి ఎంపిక పైన కసరత్తు చేసింది. కాగా, చివరి నిమిషంలో అనూహ్య మార్పులు జరిగితే మినహా పార్టీ ఏపీ చీఫ్ గా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరు ఖరారు ఖాయంగా కనిపిస్తోంది.
కొత్త అధ్యక్షుడిగా..
ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పలువురు ముఖ్య నేతలు రేసులో ఉన్నారు. చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజిక సమీకరణాలు కీలకంగా మారాయి. అయితే, మోదీ - షా ద్వయం ఏపీలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వంలో ఉండ టం భవిష్యత్ రాజకీయాలకు అనుగుణంగా అధ్యక్షుడి పైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు పది మంది వరకు ఆశావాహులు పార్టీ అధ్యక్షుడి పదవి కోసం పోటీ లో ఉన్నారు. వారిలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థ సారథి, విశాఖకు చెందిన మాజీ ఎమ్మెల్సీ మాధవ్, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి పేర్లు ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే, బీజేపీ నాయకత్వం మాత్రం భవిష్యత్ వ్యూహాలకు అనుగుణంగా ఎంపిక చేసింది.
బీసీ నేతకే పగ్గాలు
బీసీ వర్గానికి బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యత ఇస్తోంది. అయితే.. ఇప్పటికే రాయలసీమకు చెందిన బీసీ నేత సత్య కుమార్ కు మంత్రిని చేసారు. రెండు రాజ్యసభకు సీట్లు కూడా బీసీ(ఆర్. కృష్ణయ్య, పాకా సత్యనారాయణ)లకే ఇచ్చారు. దీంతో.. ఇప్పుడు పార్టీ అధ్యక్ష బాధ్యతలు బీసీ నేతకు ఇస్తారా అనే చర్చ జరిగింది. కాగా, టీడీపీ - జనసేనతో పొత్తులో ఉన్న వేళ.. ఆ రెండు పార్టీలకు రెండు ప్రధాన సామాజిక వర్గాలు మద్దతుగా నిలుస్తున్నాయి. తెలంగాణలో గత ఎన్నికల సమయంలో బీజేపీ బీసీ సీఎం నినాదంతో ముందుకు వెళ్లటం కలిసి వచ్చింది. ఏపీలోనూ బీసీ ఓటింగ్ కీలకంగా మారుతోంది. దీంతో.. బీజేపీ ముందస్తుగానే తమ వ్యూహాలను అమలు చేయటం లో భాగంగా బీసీ నేతకు పార్టీ పగ్గాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మాధవ్ కే ఛాన్స్..!
బీసీ వర్గం నుంచి ఇద్దరు నేతలు ప్రధానంగా పోటీలో నిలిచారు. కాగా, తొలి నుంచి పార్టీకి విధేయత తో పాటుగా మిత్రపక్షాలతో సమన్వయం చేసుకునే నేతకు పగ్గాలు అప్పగించాలని డిసైడ్ అయ్యారు. అందులో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నేతకు బాధ్యతలు అప్పగించటం ద్వారా రానున్న రోజుల్లో కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. అందులో భాగంగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ కు బాధ్యతలు అప్పగించటం ఖాయమైందని పార్టీ నేతల సమాచారం. పోటీ లేకుండా మాధవ్ నామినేషన్ దాఖలు.. అధికారికంగా ప్రకటన వరకు ఢిల్లీ నాయకత్వం ఇప్పటికే సూచన లు చేసినట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో ఢిల్లీ కేంద్రంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే మినహా.. బీసీ వర్గానికే బీజేపీ ఏపీ అధ్యక్ష పదవి ఖాయంగా కనిపిస్తోంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi