భక్తుల నుంచి
తిరుమలలో శ్రీవారి సేవకులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. టీటీడీ ఎంపిక చేసిన వీరంతా నిర్దేశించిన విధుల్లో భక్తులకు సేవలు అందిస్తున్నారు. శ్రీవారి సేవకులకు ఇప్పుడు టీటీడీ కొత్త బాధ్యతలను అప్పగించింది. టీడీడీ అందిస్తున్న వివిధ సేవలపై భక్తుల నుండి టీటీడీ విస్తృత అభిప్రాయ సేకరణ బాధ్యత వారికి కేటాయించింది. భక్తులకు అందిస్తున్న వివిధ సేవలను ఎప్పటికప్పుడు మరింత మెరుగుపరచడంలో భాగంగా గత కొంత కాలంగా టీటీడీ భక్తుల నుండి విలువైన అభిప్రా యాల్ని వివిధ రకాల ఫీడ్‌బ్యాక్ సర్వేల ద్వారా సేకరించడం ప్రారంభించింది. ఐవీఆర్ఎస్, వాట్సాప్ ల ద్వారా e-Survey, శ్రీవారి సేవకుల ద్వారా మాన్యూవల్ సర్వేలను ప్రారంభించి టీటీడీ భక్తుల నుండి అభిప్రాయాలు తీసుకుంటోంది.
ఫీడ్ బ్యాక్ సర్వే ఈ ఎలక్ట్రానిక్ సర్వే విధానం ద్వారా భక్తులు తిరుమల యాత్ర పూర్తి అనుభవం, అన్న ప్రసాదం, కళ్యాణ కట్ట, శ్రీవారి ఆలయం, వసతి, క్యూ లైన్ల నిర్వహణ మరియు లగేజీ కౌంటర్ల పై మొత్తం 16 ప్రశ్నలపై తమ అభిప్రాయాలను తెలిపేందుకు ఈ సర్వే చేస్తున్నారు. అదే విధంగా తిరుమల, తిరుపతిలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌లను మొబైల్‌తో స్కాన్ చేస్తే (వాట్సాప్ నెం: 9399399399) టీటీడీ అభిప్రాయ సేకరణ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ భక్తులు తమ పేరు, విభాగం (అన్నప్రసాదం, శుభ్రత, కల్యాణకట్ట, లడ్డూ ప్రసాదం, లగేజీ, దర్శన అనుభవం, క్యూలైన్, గదులు మొదలైనవి)ను ఎంచుకోవాలి.
శ్రీవారి సేవకుల ద్వారా
ఇక, అదే విధంగా తిరుమల, తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై ప్రత్యక్షంగా అభిప్రాయ సేకరణ చేయడం జరుగుతోంది. ఈ విధానంలో సేవకులు టీటీడీ రూపొందించిన ప్రశ్నావళితో కూడిన అప్లికేషన్ ను తమ మొబైల్ లో డౌన్ లోడ్ చేసుకుని భక్తుల నుండి అభిప్రాయాలు సేకరిస్తారు. కాగా.. త్వరలోనే టీటీడీ మొబైల్ యాప్ మరియు టిటిడి బుకింగ్ పోర్టల్ నుండి భక్తులు యొక్క విలువైన సలహాలు సూచనలు తీసుకొనడానికి అప్లికేషన్ రూపొందిస్తున్నారు. భక్తుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ, సేవలను మరింత మెరుగుపరచడం కోసం ఈ సర్వేల ద్వారా వారి ప్రత్యక్ష అనుభవాలను సేకరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. భక్తులు ఈ అభిప్రాయ సేకరణకు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi