ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే వచ్చాయి. ఇక ఈసారి విస్తారంగా వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు పదే పదే చెప్పటంతో రైతులు కూడా ముందస్తుగా వ్యవసాయ పనులు ప్రారంభించారు. అయితే ఊహించని విధంగా మేలో వర్షాలు కురవగా జూన్ మాసంలో పెద్దగా వర్షాలు కురవలేదు. అడపాదడపా పడిన చినుకులు తప్ప గడచిన 25 రోజుల్లో పెద్దగా వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.
ఏపీలో వర్షాలు
మళ్లీ ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి వాతావరణ శాఖ వర్షాలకు సంబంధించి శుభవార్త చెబుతుంది. రానున్న మూడు రోజులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఒకపక్క బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయని ఇప్పటికే చెప్పిన వాతావరణ శాఖ అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్పపీడనం ఏర్పడినట్లు, దీని కారణంగా కూడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
రానున్న మూడు రోజులూ వానలే.. మత్స్యకారులకు అలెర్ట్
రాబోయే మూడు రోజులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షాలు పడే నేపథ్యంలో సముద్రం అలజడిగా మారే ప్రమాదం ఉంటుందని, మత్స్యకారులు ఈరోజు వేటకు వెళ్లకూడదని విశాఖ హెచ్చరికల కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది
ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు.. నేడు ఈ జిల్లాలలో వర్షాలకు చాన్స్
ఇదిలా ఉంటే నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. ఉత్తరబంగాళాఖాతం,ఆనుకునిఉన్న బంగ్లాదేశ్,పశ్చిమబెంగాల్ తీరప్రాంతాల్లో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న కారణంగా, దీని ప్రభావంతో శ్రీకాకుళం,విజయనగరం,మన్యం,అల్లూరి,విశాఖ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారువర్షాలు,మిగతాజిల్లాల్లో చెదరమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
వర్షాల కోసం రైతన్నల నిరీక్షణ
వర్షాలు పడే ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మొత్తంగా మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పిన నేపధ్యంలో ఏపీలో ప్రజలు వర్షాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రైతులు వర్షాల కోసం నిరీక్షిస్తున్నారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi