రాష్ట్రంలో సెక్స్ వర్కర్లు పెరిగిపోయారని ఓ పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా తాను వ్యాఖ్యలు చేశానని, రాజధాని మహిళలను కానీ రాష్ట్రంలోని మహిళలను కానీ అవమానించే ఉద్దేశం, విమర్శించే ఉద్దేశం తనకు లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ లో భాగంగానే తాను పలు ఛానల్లో విశ్లేషణలు చేస్తుంటానని, జర్నలిజం విలువలకు కట్టుబడి తాను సుదీర్ఘకాలం పాత్రికేయ రంగంలో పనిచేస్తున్నానని పిటిషన్ లో వివరించారు. ఇదే సమయంలో మంగళగిరి కోర్టు తనపై నమోదు చేసిన కేసుల విషయంలో పోలీసులను నిలదీసినట్టు పిటిషన్ లో పేర్కొన్నారు.
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ లను నమోదు చేయడానికి మంగళగిరి కోర్టు తప్పు పట్టిందని, వాటిని తక్షణం తొలగించాలని పోలీసులను ఆదేశించిందని, దీంతో తనపై నమోదు చేసిన సెక్షన్లను తొలగించారని హైకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్ లో కృష్ణంరాజు వివరించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నట్టు తెలిసింది. భావ ప్రకటన, పాత్రికేయ పరమైన విలువలను కాపాడే లక్ష్యంతో సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో అనేక తీర్పులు ఇచ్చిందని వాటిని పరిగణనలోకి తీసుకొని తనపై నమోదైన అన్ని కేసులను కొట్టివేయాలని కోర్టును అభ్యర్థించారు.
ఇవన్నీ రాజకీయ కక్షపూరితంగా నమోదైన కేసులేనని, తనపై ఇప్పటివరకు ఒక్క కేసు కూడా లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. కాదా దీనిపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు మూడు రోజులపాటు తమ కస్టడీలోకి తీసుకున్న తుళ్లూరు పోలీసులు కృష్ణంరాజును శనివారం రాత్రి 11 వరకు విచారించారు. అయితే ఏ ప్రశ్న అడిగినా తను మరిచిపోయానని, గుర్తు లేదని కృష్ణంరాజు చెప్పినట్టు దర్యాప్తు అధికారి మీడియాకు వెల్లడించారు.
ముఖ్యంగా బ్యాంకు ఖాతాల్లో విరివిగా సొమ్ములు రావడం, దేశ విదేశీ అకౌంట్ల నుంచి కూడా నిధులు జమ కావడంపై ప్రశ్నించినట్టు చెప్పారు. అయితే ఆ వివరాలు ఏవీ తనకు తెలియదని తాను మరిచిపోయానని కృష్ణంరాజు చెప్పినట్టు తెలిపారు. న్యాయవాది సమక్షంలో విచారిస్తున్నామని పేర్కొన్నారు. సోమవారంతో కృష్ణంరాజు కస్టడీ ముగుస్తుందని తెలిపారు.