Hot Posts

6/recent/ticker-posts

అమెరికా భీకర దాడులు... ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధాని మోదీ


ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా దాడులు

పశ్చిమాసియాలో పెరిగిపోతున్న ఉద్రిక్తతలు

చర్చలు, దౌత్య మార్గాల్లో శాంతిని పునరుద్ధరించాలన్న ప్రధాని మోదీ

ఇరాన్ పై అమెరికా భీకర దాడుల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగిపోతుండడం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించి, దౌత్యపరమైన చర్యల ద్వారా శాంతిని పునరుద్ధరించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు నేడు ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసూద్ పెజెష్కియాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు.

ఈ సంభాషణ వివరాలను ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పంచుకున్నారు. "ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ పెజెష్కియాన్‌తో మాట్లాడాను. ప్రస్తుత పరిస్థితిపై మేమిద్దరం వివరంగా చర్చించుకున్నాం. ఇటీవల పెరిగిన ఉద్రిక్తతల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాను. తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించాలని, చర్చలు, దౌత్యం ద్వారా ముందుకు సాగాలని తెలిపాను. ప్రస్తుత పరిస్థితుల్లో అదే మెరుగైన మార్గమని తెలిపారు. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వం త్వరగా పునరుద్ధరించాలని స్పష్టం చేశాను" అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

కాగా, అనూహ్య రీతిలో అమెరికా ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై బాంబు దాడులు చేయడం గమనార్హం. ఈ దాడులు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రతిస్పందనలకు దారితీశాయి. ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్‌లలోని తమ అణు కేంద్రాలపై అమెరికా జరిపిన దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇది "క్రూరమైన సైనిక దాడి" అని, అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను స్థూలంగా ఉల్లంఘించడమేనని అభివర్ణించింది. ఈ దాడుల నేపథ్యంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితిని, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ)ను ఇరాన్ కోరింది.

WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now