Hot Posts

6/recent/ticker-posts

ఒక మోపెడ్.. 233 చలాన్లు.. ఈ తప్పు మాత్రం మీరు చేయొద్దు

ట్రాఫిక్ పోలీసులు పెండింగ్ చలానాలు ఉన్న వాహనాల్ని ఆపటం.. వారి చేత చలానాలు కట్టించే తీరు తెలిసిందే.

ట్రాఫిక్ పోలీసులు పెండింగ్ చలానాలు ఉన్న వాహనాల్ని ఆపటం.. వారి చేత చలానాలు కట్టించే తీరు తెలిసిందే. ప్రాంతం ఏదైనా.. ట్రాఫిక్ పోలీసుల తీరు మాత్రం ఒకేలా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే.. వీరు చేసే డ్యూటీ చాలామందికి నచ్చదు. కానీ.. తప్పులు చేయకుండా జాగ్రత్తలు తీసుకునేలా వాహనదారులకు తెలిసొచ్చేలా చేస్తుంటారని మాత్రం చెప్పక తప్పదు. తాజాగా హనుమకొండ జిల్లా కాజీపేటలో ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భాగంగా షాకింగ్ ఉదంతం ఒకటి వెలుగు చూసింది.

పెండింగ్ చలానాలు కట్టించే కార్యక్రమాన్ని చేపట్టిన వారికి ఒక టూవీలర్ ను ఆపారు. దాని మీద ఉన్న చలానాలు ప్రింట్ చేయగా.. చాంతాడంత కాగితం బయటకు వచ్చింది. రీడింగ్ మెషిన్ లో వెహికిల్ నెంబరును నమోదు చేసినంతనే వందల్లో ఉన్న చలానాలు ప్రింట్ కావటంతో ట్రాఫిక్ పోలీసులు సైతం అవాక్కైన పరిస్థితి.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 233 చలానాలు సదరు వెహికిల్ మీద ఉన్న విషయాన్ని గుర్తించిన పోలీసులే కాదు.. వాహనదారుడు కూడా విస్తుపోయాడు. ఎందుకంటే.. సదరు వాహనదారులు సెకండ్ హ్యాండ్ కింద బండి కొన్నాడు. ఈ వాహనం మీద ఇంత పెద్ద ఎత్తున చలానాలు పెండింగ్ ఉన్నాయన్న విషయం తెలీకపోవటమే. 2016 నుంచి చలానాలు పెండింగ్ లో ఉన్నాయని.. మొత్తం చలానాల విలువ అక్షరాల రూ.45,350గా గుర్తించారు.

చలానాల మొత్తం గురించి విన్నంతనే వాహనదారుడు అస్లాం షాక్ తిన్నాడు. ఆ వాహనాన్ని అమ్మినా రూ.15 వేలు కూడా రావని వాపోయాడు. ఏడాది క్రితం తాను కరీంనగర్ కు చెందిన వ్యక్తి నుంచి వాహనాన్ని కొన్నట్లుగా పేర్కొన్నాడు. ఇన్ని చలానాలు ఉన్నట్లు తనకు తెలీవని.. తన దగ్గర అంత డబ్బుల్లేవని వేదన చెందాడు. నిబంధనల్ని అనుసరించి వాహనాన్ని సీజ్ చేసిన అధికారులు వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వాహనం ఏదైనా సెకండ్ హ్యాండ్ లో కొనే వేళలో.. ఆ వాహనం మీవ ఉన్న చలానాల లెక్క గురించి పక్కాగా తెలుసుకోవాల్సిందే. లేదంటే భారీగా నష్టపోవటమే కాదు.. ఈ తరహా ఘటనలకు అవకాశం ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు.


 

WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now