గోవింద నామస్మరణతో మారుమోగిన జొన్నాడ పురవీధులు
డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆలమూరు: తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు అధికారి శ్రీ పగడాల ఆనంద తీర్థాచార్యుల నేతృత్వంలో జొన్నాడ శ్రీ వైట్ల చిన వెంకన్న కళ్యాణ మండపంలో జరుగుతున్న శ్రీ పురందరదాసుల సంకీర్తన శిక్షణా తరగతులు భక్తజన కోలాహలాన్ని తలపించాయి.
మూడవ రోజైన శుక్రవారం జొన్నాడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నుంచి మొదలైన శోభాయాత్ర ఆధ్యంతం భక్తి తన్మయత్వాన్ని రేకెత్తించింది. జొన్నాడ లోని రెండు భజన మండళ్ళ సభ్యులతో పాటుగా వివిధ ప్రాంతాల నుంచి శిక్షణా తరగతులకు హాజరైన భజన మండలి సభ్యులు కోలాటం, భక్తి సంకీర్తనలు, గోవింద నామస్మరణ చేసుకుంటూ గ్రామమంతా ఊరేగారు.
కార్యక్రమంలో గొలుగూరి ఈశ్వర్ రెడ్డి, తాడి శ్రీనివాసరెడ్డి, గొడవర్తి బాబి, అయినవిల్లి సత్తిబాబు గౌడ్ తదితరులు పాల్గొని శోభాయాత్రను ముందుండి నడిపించారు.