Hot Posts

6/recent/ticker-posts

కపిలేశ్వరపురం మండల పరిషత్ సమావేశంలో ఎంపీటీసీల ఆవేదన..


21 నెలలుగా గౌరవ వేతనాలు లేవు – ఎంపీటీసీల నిరసన..


అంబేద్కర్ కోనసీమ జిల్లా, కపిలేశ్వరపురం: మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీలు ప్రభుత్వంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత ఇరవై ఒక్క నెలలుగా గౌరవ వేతనాలు అందలేదు అని వారు వెల్లడిస్తూ, తమ సమస్యలను వెల్లడిస్తూ ప్లే కార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ఈ సమావేశానికి మండల ప్రజా పరిషత్ చైర్‌పర్సన్ మేడిశెట్టి సత్యవేణి అధ్యక్షత వహించారు. ప్రారంభంలో ఇటీవల అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన బాధితులకు, అలాగే నేలటూరు మాజీ ఎంపీటీసీ చల్లా వీర్రాజు మృతి పట్ల రెండు నిమిషాల మౌనాన్ని పాటించారు.


అధికారుల తీరు పట్ల మండిపడిన తోట త్రిమూర్తులు..

ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పలువురు అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాతపూడి గ్రామంలో రెండు సంవత్సరాల క్రితం పూర్తైన వంతెనకు సంబంధించి గుత్తేదారుడికి ఇవ్వాల్సిన ₹1 లక్ష రుసుము ఇప్పటికీ ఎందుకు ఇవ్వలేదని ఆయన అధికారులను నిలదీశారు. ఇదే విషయాన్ని గతంలో కూడా సమావేశాల్లో ప్రస్తావించినా చర్యలు లేకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు.


చెరువు గట్టు మీద చెట్లు – వేగుళ్ల జోక్యం..?

నిడసనమెట్ట గ్రామంలో చెరువు గట్టు పై ఉన్న కొబ్బరి చెట్లను వేలం వేయకుండా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు జోక్యం చేస్తుంటారని జడ్పీటీసీ అబ్బు ఆరోపించారు. ఆయన అనుచరులు దౌర్జన్యంగా కొబ్బరి ఫలసాయంను స్వాధీనం చేసుకుంటున్నారని, దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని హెచ్చరించారు.


విద్యార్థుల బదిలీపై విమర్శలు..

కేదార్లంక మరియు టేకి గ్రామాల విద్యార్థులను దూరంలోని పాఠశాలలకు బదిలీ చేయడంపై 

తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. స్థానిక ఎంపీటీసీలు, తల్లిదండ్రులు సమావేశానికి హాజరై తమ పిల్లల సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. పిరమిడ్ నిర్మాణానికి టేకి గ్రామ పంచాయతీ స్థలాన్ని కేటాయించినా, కార్యదర్శి వ్యతిరేకిస్తున్నారని ఎంపీపీ సత్యవేణి ఆరోపించారు.


అధికారులు రాజకీయంగా ఒత్తిళ్లలో...

ఈ సమావేశంలో ఎంపీడీవో రాజేంద్రప్రసాద్ ,ఈవో పీఆర్‌డీ మోహన్, ఎంపీటీసీలు, సర్పంచులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే వేగుళ్ల మరియు ప్రతిపక్ష ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల మధ్య రాజకీయ ప్రభావం కారణంగా అధికారులు ఒత్తిడికి లోనవుతున్నారనే వాదనలు వినిపించాయి.

WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now