డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆలమూరు: ఆలమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యను అభ్యసించి ఇటీవల విడుదలైన ఫలితాల్లో 914 మార్కులతో పాటు, ఏపీఈఏపీసెట్ లో 11,776 ర్యాంకు సాధించిన వాకా అమృతకు ప్రిన్సిపాల్ నల్లమిల్లి సురేష్ రెడ్డి, ఆలమూరు ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ గుణ్ణం వీర్రాజు, జాయింట్ సెక్రటరీ గారపాటి త్రిమూర్తులు చేతుల మీదుగా ఘన సత్కారం నిర్వహించారు.
దుశ్శాలువా కప్పి, బహుమతులు అందించి అభినందించారు. ప్రభుత్వ కళాశాలలో విద్యాభ్యాసం చేసి కార్పోరేట్ కళాశాలలతో సమానంగా ర్యాంకు సాధించడం అభినందనీయమని అన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నైపుణ్యం కల్గిన అధ్యాపకులు అందుబాటులో ఉండటంతో పాటుగా, ఉచిత విద్య, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందుబాటులో ఉందని, చుట్టుప్రక్కల గ్రామాల తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ కళాశాలలో చేర్చి ఇక్కడ లభిస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకోవాలని ప్రిన్సిపల్ సురేష్ రెడ్డి ఈ సందర్భంగా కోరారు.