ANDRAPRADESH, ELURU, DENDULURU: గోదావరి జిల్లాలో పక్కా పాపులర్ మాస్ లీడర్ గా చింతమనేని ప్రభాకర్ ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆయన దూకుడు రాజకీయం చేస్తారు. ఫైర్ బ్రాండ్. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. ఆఖరుకు జర్నలిస్టులతో అయినా అలాగే ఉంటారు. ఆయన ఫైర్ బ్రాండ్ గా టీడీపీలో పేరు తెచ్చుకున్నారు. ఆయన ఏలూరు జిల్లా దెందులూరు నుంచి చింతమనేని ఇప్పటికి మూడు సార్లు గెలిచారు. ఆయన తొలిసారి 2009లో ఎమ్మెల్యే అయ్యారు. ఆ సమయంలో టీడీపీ ఉమ్మడి ఏపీలో విపక్షంలో ఉంది. ఇక 2014లో మరోసారి గెలిచారు. విభజన ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది కానీ అయితే ఆ టెర్మ్ అంతా ఆయన వివాదాలలో ఉన్నారు.
ఆయన అప్పటి ఎమ్మార్వో వనజాక్షిని బెదిరించిన వివాదంలో చిక్కుకుని ఉక్కిరి బిక్కిరి అయ్యారు. అంతే కాదు దందాలు వ్యవహారాలు అంటూ ఎన్నో ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆయన వివాదాస్పద ఎమ్మెల్యేగా ముద్రపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన 2019 ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. ఓడిన తర్వాత ఆయన మీద వైసీపీ ప్రభుత్వంలో కేసులు పడ్డాయి. కొన్నాళ్ళు జైలులో ఉండి వచ్చారు. ఈ క్రమంలో ఆయన కూడా మరింతగా రాటు దేలారు. అయితే ఆయన 2024 ఎన్నికల్లో ఒక ప్రభంజనంగా వచ్చిన కూటమి వేవ్ లో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచారు. ఇలా మూడు సార్లు గెలిచినా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. సీనియర్ నేతగా ఉన్న చింతమేనికి ఈ పదవి దక్కకపోవడానికి ఆయన వైఖరే కారణం అని అంటున్నారు.
ఆయన వివాదాలతో జోడీ కడుతూండడం వల్లనే అందలం అందకుండా పోతోంది అని అంటున్నారు. దాంతో హైకమాండ్ నుంచి ఏమైనా సలహా సూచనలు వచ్చాయో లేక సన్నిహితులు అయినా హితబోధ చేశారో తెలియదు కానీ చింతమనేని రాముడు మంచి బాలుడు అన్నట్లుగా మారిపోయారు అని అంటున్నారు. ఇపుడు ఆయన తీరు పూర్తిగా డిఫరెంట్ అంటున్నారు. నిత్యం ప్రజా సమస్యల మీద ఉంటున్నారు. అందరితో బాగా ఉంటున్నారు. అభివృద్ధి మంత్రం జపిస్తున్నారు. ఆయనకు రాజకీయంగా కలసివస్తున్న మరో విషయం ఏమిటి అంటే వైసీపీ దెందులూరు ఇంచార్జి అయిన అబ్బయ్య చౌదరి ఏకంగా అమెరికాలో మకాం పెట్టేయడం. దాంతో వైసీపీకి నాయకుడు లేక చతికిలపడింది.
దీంతో చింతమనేని ఇదే అదనుగా పార్టీని అభివృద్ధి చేస్తున్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. ఇలా ఆయన మారిపోవడానికి కారణాలు తెలిసీ తెలియక సొంత పార్టీలోనే చర్చ సాగుతోంది. అయిత చింతమనేని మినిస్టర్ కుర్చీ మీద కన్ను వేశారని విస్తరణలో కచ్చితంగా ఆయన మంత్రి అవుతారని అంటున్నారు. అంగబలం అర్ధబలం కలిగిన చింతమనేని వంటి వారు మంత్రి పదవిలో ఉంటే 2029 ఎన్నికల నాటి గోదావరి జిల్లాలలో దూకుడు వేరే లెవెల్ లో ఉంటుందని అంటున్నారు.
బహుశా హైకమాండ్ కి కూడా చింతమనేని మీద సాఫ్ట్ కార్నర్ ఉండొచ్చని అందుకే ఆయనను నిదానించమని చెప్పి ఉండొచ్చని అంటున్నారు. ఏది ఏమైతేనేమి రాష్ట్ర రాజకీయాల్లో ఎపుడూ వార్తల్లో ఉంటూ వివాదాలతో నిలిచే చింతమనేని మాత్రం ఇపుడు మౌనంగా తన పనేంటో తానేంటో అన్నట్లుగా ఉన్నారని అంటున్నారు. దాంతో చింతమమేని కోరిక నెరవేరుతుందా అన్న చర్చ సాగుతోంది. చింతమనేని కాబోయే మంత్రి అని అపుడే అనుచరులు పొంగిపోతున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.