TELANGANA, HYDERABAD: కాంగ్రెస్ నేతను బీజేపీ నేతలు ఎక్కడైనా ప్రశంసిస్తారా? కానీ తెలంగాణ రాజకీయం మాత్రం డిఫరెంటుగా సాగుతోంది. కొద్దిరోజులుగా టీ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో సన్నిహితంగా ఉంటున్నారని ఓ వర్గం ప్రచారం చేస్తుండగా, ఇప్పుడు మరో కాషాయ నేత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సానుకూల వైఖరి ప్రదర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కరుడు గట్టిన హిందూ వాదిగా ముద్రపడిన ఆ నేత.. తన పార్టీకి బద్ధ విరోధి అయిన కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అభినందించడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కొద్దిరోజులుగా ఆ బీజేపీ ఎమ్మెల్యే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సానుకూలంగా ఉండటం కూడా చర్చనీయాంశమవుతోంది.
హైదరాబాద్ నగరంలోని ఏకైక బీజేపీ ఎమ్మెల్యే, కరుడు గట్టిన హిందూ వాదిగా భావించే ఎమ్మెల్యే రాజాసింగ్ మరో మారు సీఎం రేవంత్ రెడ్డిపై సానుకూల వైఖరి ప్రదర్శించారు. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై సానుకూల వ్యాఖ్యలు చేసి వేడి రాజేసిన రాజాసింగ్ తాజాగా మీడియాతో మాట్లాడి అవే రకమైన వ్యాఖ్యలు చేశారు. కొత్త గోశాల నిర్మించాలనే నిర్ణయం, తల్లి ఆవు గురించి ఆలోచించినందుకు, విధి విధానాలపై కమిటీ వేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యావాదాలు తెలిపారు రాజాసింగ్.
మోడల్ గోశాలలు కడుతున్నందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన రాజాసింగ్, ఇల్లీగల్ గా కబేళాలు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా గోరక్షణ కోసం స్పెషల్ పోలీస్ ఫోర్సు నియమించాలని ఎమ్మెల్యే సూచించారు. ఆ ఫోర్సులో తనను కూడా చేర్చాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. అలా చేస్తే గో సంరక్షణలో తొలి పేరు యూపీ సీఎం ఆదిత్యనాథ్ కి వస్తే రెండో పేరు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని రాజాసింగ్ వెల్లడించారు.
వేములవాడ, యాదగిరిగుట్ట, హైదరాబాద్ నగర శివార్లలో ఎనికేపల్లి, పశుసంవర్థక విశ్వవిద్యాలయంలోని విశాల ప్రదేశాల్లో గోశాలలు నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దీనిపై ముగ్గురు అధికారులతో కమిటీని నియమించారు. గో సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధానాలును అధ్యయనం చేయాలని సీఎం ఆ అధికారులకు సూచించారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ సీఎం నిర్ణయాన్ని స్వాగతించడం ఆసక్తికరంగా మారింది.