అఖండ గోదావరి ప్రాజెక్టు శంఖుస్థాపన కోసం రాజమండ్రికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎదురేగి స్వాగతం పలికారు. దీంతో పవన్ కూడా ఉత్సాహంగా ఆయనతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేశాక ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాత్రం పవన్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి దూరంగా నిలబడ్డారు. అనంతరం పవన్ చేసిన ప్రసంగంలో గోరంట్ల ప్రస్తావన తెచ్చారు.
మనందరికీ ఇష్టులైన పట్టువిడవని విక్రమార్కులు, నాకిష్టమైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి అంటూ పవన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మనం తగ్గామే తప్ప ఆయన తగ్గలేదంటూ పవన్ వ్యాఖ్యానించారు. ఆయన్ను చూసి మనం నేర్చుకోవాలన్నారు. మనకి అడాప్టబిలిటీ రాదని, ఆయన్ను చూసి నేర్చుకోవాలన్నారు. పవన్ వ్యాఖ్యలకు పక్కనే ఉన్న జనసేన మంత్రి కందుల దుర్గేష్ నవ్వుతుండగా.. దూరంగా ఉన్న గోరంట్ల మాత్రం ఏమనాలో తెలియక ఇబ్బందిగా మొహం పెట్టారు.
ఇంతకీ పవన్ ఇలా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గురించి ఇలా వ్యాఖ్యలు చేయడం వెనుక కీలక కారణం ఉంది. గత ఎన్నికల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సొంత నియోజకవర్గమైన రాజమండ్రి రూరల్ నుంచి ఆయన మరోసారి పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. కానీ అదే నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న జనసేన నేత కందుల దుర్గేష్ కూడా తనకు అదే సీటు కావాలని పట్టుబట్టారు. దీంతో పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో ఈ విషయంపై మాట్లాడి తమ పార్టీలో కీలక నేత అయిన దుర్గేష్ కు ఈ సీటు ఇవ్వాలని అడిగారు.
కానీ బుచ్చయ్యను కాదని దుర్గేష్ కు ఈ సీటు ఇచ్చేందుకు బాబు నో చెప్పేశారు. దీంతో బుచ్చయ్య ఈ సీటు నుంచి పోటీ చేయడం, గెలవడం జరిగిపోయాయి. అదే సమయంలో దుర్గేష్ ను కొత్త సీటు అయిన నిడదవోలుకు పంపి అక్కడి నుంచి పవన్ గెలిపించుకున్నారు. అప్పట్లో బుచ్చయ్య రాజమండ్రి రూరల్ కోసం పట్టుబట్టిన వ్యవహారంపై పవన్ ఇలా నవ్వుతూనే అక్షింతలు వేసినట్లు తెలుస్తోంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi