తెలంగాణ కాంగ్రెస్ లో కొద్ది రోజులుగా నేతల వివాదాస్పద వ్యాఖ్యల పైన హైకమాండ్ గుర్రుగా ఉంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల పైన పార్టీ పరిశీలకుల ద్వారా నివేదికలు తెప్పించు కున్న పార్టీ నాయకత్వం నేరుగా వారితో మాట్లాడుతోంది. సుదీర్ఘ పోరాటం తరువాత అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ... ప్రత్యర్థి పార్టీలకు అవకాశం ఇచ్చే విధంగా వ్యవహరించటం ఏంటని మండి పడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దం అవుతున్న సమయంలో సొంత పార్టీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు... ఫిర్యాదులు చేసుకోవటాన్ని పార్టీ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. తెలంగాణ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసిన పార్టీ హైకమాండ్ ఇక్కడ జరుగుతున్న పరిణామాలను సూక్ష్మ స్థాయిలో పరిశీలిస్తోంది.
తెలంగాణలో వచ్చిన అధికారాన్ని.. వచ్చే ఎన్నికల్లోనూ నిలబెట్టుకొనే విధంగా ఉండాలని పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఒక కీలక మంత్రికి నిర్దేశించినట్లు సమాచారం. అదే సమయంలో మంత్రి వర్గంలో చర్చించి వెల్లడించాల్సిన నిర్ణయాలను ముందుగానే ప్రకటనలు చేస్తున్నారనే ఫిర్యాదు ల పైనా హైకమాండ్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ముఖ్యమంత్రి రేవంత్ ప్రణాళికా బద్దంగా వెళ్తున్న సమయంలో పార్టీ నేతలు సహకరించాల్సిందేనని హైకమాండ్ తేల్చి చెప్పింది. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని క్లారిటీ ఇచ్చింది. ఎప్పటికప్పుడు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షీ నటరాజన్ నుంచి అధినాయకత్వం నివేదికల ద్వారా పరిస్థితిని గమ నిస్తోంది. ఎవరు పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినా చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. వచ్చే వారం పార్టీలో తమ వ్యాఖ్యలతో వివాదాలకు కారణమైన మరో ఇద్దరు నేతలను ఢిల్లీకి పిలిపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యవహారాల పైన పార్టీ నాయకత్వం సీరియస్ గా ఉందనే సమాచారం కీలక పరిణామంగా భావిస్తున్నారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi