Hot Posts

6/recent/ticker-posts

కేసీఆర్ కలలో కూడా తెలంగాణకు నష్టం చేయరు: కవిత

సీఎం రేవంత్ రెడ్డికి ‘అవినీతి చక్రవర్తి’ బిరుదు ఇస్తున్నామని ప్రకటన

ఏడాదిన్నరలోనే 2 లక్షల కోట్ల అప్పు.. ఆ డబ్బు ఏంచేశారని నిలదీసిన ఎమ్మెల్సీ

చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీ తర్వాతే బనకచర్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి కేసీఆర్ కలలో కూడా తెలంగాణకు నష్టం చేయరని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మించారని, ఇందుకోసం ఆయన అప్పులు చేశారని, ఆ అప్పులను తన హయాంలోనే తిరిగి చెల్లించారని ఆమె తెలిపారు. ఈ రోజు ఉదయం జూబ్లీహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే రూ.2 లక్షల కోట్ల మేర అప్పు చేసిందని కవిత ఆరోపించారు. ఇంత భారీగా అప్పులు చేసినా సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని, మరి ఆ డబ్బంతా ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీశారు.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ జరిగిన తర్వాతే ఏపీలోని బనకచర్ల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని కవిత ఆరోపించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు భయపడి బనకచర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మౌనం వహిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ బిర్యానీ తినిపించి బనకచర్ల నీళ్లను చంద్రబాబుకు అప్పగిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గతంలోనే "ఆంధ్రా బిర్యానీ" గురించి చెప్పారని గుర్తుచేశారు.

బనకచర్ల ప్రాజెక్టు ద్వారా మెగా కంపెనీకి లబ్ధి చేకూర్చేందుకే దీనిని నిర్మిస్తున్నారని కవిత మండిపడ్డారు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆంధ్రాలో మేధావులు కూడా సమావేశమయ్యారని కవిత తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి "అవినీతి చక్రవర్తి" అనే బిరుదు ఇస్తున్నామని, ఆయన అవినీతిపై జాగృతి ఆధ్వర్యంలో ఒక బుక్‌లెట్ ప్రచురించి రాష్ట్రవ్యాప్తంగా పంచుతామని కవిత ప్రకటించారు.

18 నెలల పాలనలో రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాము తెచ్చిన అప్పులతో కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీ కడుతున్నామని సీఎం అంటున్నారని, కానీ రెండు లక్షల కోట్లు అప్పు చేసినా పింఛన్లు, మహాలక్ష్మి పథకం సరిగా అమలు కావడం లేదని విమర్శించారు. కేసీఆర్ ఆర్ఈసీ వద్ద అప్పులు తెచ్చి ప్రాజెక్టులు కట్టారని, ఆ అప్పులను తిరిగి చెల్లించారని, ఆర్ఈసీ సంస్థ కేసీఆర్ ప్రభుత్వానికి 'ఏ' గ్రేడ్ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఆర్ఈసీకి కట్టాల్సిన రూ.1,320 కోట్లను జూన్ 28 లోపు చెల్లించాలని, లేకపోతే రాష్ట్రాన్ని డిఫాల్ట్‌గా ప్రకటిస్తామని ఆర్ఈసీ లేఖ రాసిందని కవిత పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రగతి అజెండా నుంచి పోలవరం ప్రాజెక్టు చర్చను తొలగించిందని కవిత విమర్శించారు. భద్రాచలం రాముడు ముంపునకు గురవుతున్నా, తెలంగాణలోని 8 మంది బీజేపీ ఎంపీలు నోరు మెదపడం లేదని దుయ్యబట్టారు. భద్రాచలం వద్ద ఉన్న ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మెగా, పొంగులేటి కంపెనీలు దక్కించుకున్నాయని, పనులు ప్రారంభం కాకముందే ఆ కంపెనీలకు అడ్వాన్స్‌లు చెల్లించారని ఆమె ఆరోపించారు.

 

WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now