Hot Posts

6/recent/ticker-posts

ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ తీపికబురు


పాత, కొత్త మెడికల్ బిల్లులకు మోక్షం.. రూ.180 కోట్లు విడుదల

నిధుల విడుదలకు ఆమోదం తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సుమారు 26,519 మందికి ప్రయోజనం చేకూరనుందని వెల్లడి

ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల హర్షం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఓ శుభవార్త అందించింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న మెడికల్ రీయంబర్స్‌మెంట్ బిల్లులకు సంబంధించిన నిధులను విడుదల చేసింది. మొత్తం రూ.180.30 కోట్ల విలువైన వైద్య బిల్లుల బకాయిలకు సంబంధించి నిధులు విడుదల చేసినట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 26,519 మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఉపశమనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నిధులను విడుదల చేసినట్లు భట్టి విక్రమార్క వివరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేరుకుపోయిన బకాయిలతో పాటు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న వైద్య బిల్లులను కూడా ప్రస్తుత ప్రభుత్వం విడుదల చేయడం గమనార్హం. ఈ పెండింగ్ బకాయిలను విడుదల చేయడం పట్ల ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వారు స్వాగతించారు. ఈ చర్య ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తోందని వారు అభిప్రాయపడ్డారు.
WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now