Hot Posts

6/recent/ticker-posts

మహానాడుకు జూనియర్ ఎన్టీఅర్ ?


ANDRAPRADESH: ప్రతీ ఏటా తెలుగుదేశం పార్టీ మహానాడు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. లక్షలాదిగా పార్టీ కార్యకర్తలు తరలి వచ్చే అతి పెద్ద పండుగ అది. By:  BCN TV NEWS ఈసారి 27, 28, 29 తేదీలలో మూడు రోజుల పాటు కడపలో టీడీపీ మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే ఈసారి మహానాడుని టీడీపీ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని తీరులో నిర్వహించాలని అధినాయకత్వం భావిస్తోంది. పది లక్షల మందితో ఈసారి మహానాడు జరగనుంది అని అంటున్నారు. దాంతో పాటుగా ఈసారి మహానాడులో అనేక సంచలన నిర్ణయాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. ఈసారి మహానాడులో అది పెద్ద విశేషం ఇదే అవుతుందని ఒక ప్రచారం అయితే సాగుతోంది. అదేంటి అంటే టాలీవుడ్ సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ని మహానాడుకు పిలుస్తారు అని అంటున్నారు. 


దివంగత నాయకుడు ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ కుమారులైన జూనియర్ ని కళ్యాణ్ రామ్ ని ఈసారి మహానాడుకు పిలవాలని పార్టీ వర్గాలు ఆలోచిస్తున్నాయట. అధినాయకత్వం ఈ విషయంలో కొత్త ఆలోచనలు చేస్తోంది అని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఆహ్వానం పంపించడం ద్వారా వారిని మహానాడు కు హాజరయ్యేలా చూడాలని భావిస్తోంది. తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఈ విధంగా సరికొత్త ఉత్సాహం కూడా అందించాలని అనుకుంటోంది. ఇక చూస్తే నారా లోకేష్ సైతం జూనియర్ విషయంలో బాగానే ఉంటున్నారు. ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్ తోనే నారా లోకేష్ ఒక సందర్భంలో సందడి చేసి అభిమానులను అలరించారు. అదే విధంగా తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గుంటూరు వచ్చిన కళ్యాణ్ రామ్ తెలుగుదేశం పార్టీ జెండాను చేత బట్టి టీడీపీ అభిమానులను అలరించారు. 

జూనియర్ ఎన్టీఆర్ అయితే తన బాబాయ్ బాలక్రిష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా గ్రీట్ చేశారు. ఈ మధ్యనే లండన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో బాబాయ్ పేరుని తలచుకున్నారు. ఇలా చూస్తే కనుక అటు నుంచి ఇటు నుంచి కూడా మంచి వాతావరణం ఉంది. అంతా ఒక్కటి అన్నట్లుగా సంకేతాలు ఇస్తున్నారు. దీంతో నారా నందమూరి కుటుంబాలు పూర్తిగా ఒక్కటి అన్న ఒక మంచి మెసేజ్ ని ఈసారి మహానాడులో ఇవ్వాలని చూస్తున్నారు అంటున్నారు. మహానాడుకు పిలిస్తే కనుక జూనియర్ ఎన్టీఆర్ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అంతే కాదు తామంతా ఒక్కటి అన్నది చెప్పాలని నందమూరి బ్రదర్స్ కి కూడా ఉంది అని అంటున్నారు 

ఇలా అటూ ఇటూ కూడా అంతా కలవాల్సిన ఏకైక సందర్భంగా మహానాడు వేదిక ఉండబోతోంది అని అంటున్నారు. మహానాడుకి కనుక జూనియర్ ఎన్టీఆర్ హాజరైతే మొత్తం ఏపీ రాజకీయాల్లో సమీకరణలే మారిపోతాయని అంటున్నారు. సినీ రంగంలో టాప్ పొజిషన్ లో ఉన్న జూనియర్ కనుక టీడీపీ వైపు ఉన్నట్లుగా సంకేతాలు ఇస్తే అది మరిన్ని కొత్త పరిణామాలకు దారి తీస్తుందని అంటున్నారు. టీడీపీకి భావి వారసుడిగా నారా లోకేష్ ఉన్నారు. జూనియర్ చూస్తే ఇప్పట్లో సినీ రంగం వీడే అవకాశాలు లేవు. దాంతో ఏ విధంగా చూసినా ఎవరికీ ఏమీ ఇబ్బంది ఉండని ఈ పరిస్థితుల్లో అంతా ఒక్కటి అని జనాల ముందుకు వస్తే అది టీడీపీకి కొత్త బలమే తప్ప మరేమీ కాదని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో.