TELANGANA: ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనూహ్య రీతిలో వ్యవహరించిన వైనం హాట్ టాపిక్ గా మారింది. BY: PASCHIMA VAHINI బుధవారం రాత్రి తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ సీఈ (చీప్ ఇంజనీర్) రమణారెడ్డికి అనూహ్య రీతిలో వార్నింగ్ ఇచ్చారు సీఎం. ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూసేకరణ.. ఆర్ అండ్ ఆర్ సమస్యలు పూర్తి చేసిన తర్వాత పంపుహౌస్ ల పనులు ప్రారంభం చేయాలని.. ఆ తర్వాతే పైపులకు సంబంధించిన బిల్లులు పెట్టాలని మహబూబ్ నగర్ సీఈకి ముఖ్యమంత్రి రేవంత్ సూచన చేశారు.
ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి అనూహ్య రీతిలో.. ‘‘అక్కడ చేసినట్లు( సదరు అధికారి కాళేశ్వరం ప్రాజెక్టులో ఎస్ఈగా పని చేశారు) ఇక్కడా చేస్తే చర్యలు తీసుకుంటాం. కేసు పెట్టి లోపల వేయిస్తా’ అంటూ చేసిన వ్యాఖ్యలతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారినట్లు చెబుతున్నారు. కాళేశ్వరం బ్యారేజీలపై విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ కేసులు ఉన్న వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయన్న సీఎం రేవంత్.. కేసులు లేని వారు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసినట్లు తెలిసింది.
ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో తప్పులు జరగకుండా ఒకటికి రెండుసార్లు జాగ్రత్తలు తీసుకోవాలని.. గతంలో పొరపాట్లు చేసిన వారిపై విజిలెన్స్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చెప్పినట్లుగా సమాచారం. మొత్తంగా ఇరిగేషన్ రివ్యూ వేళ.. సీఎం రేవంత్ నోటి నుంచి వచ్చిన హెచ్చరిక ఆ శాఖలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.