Hot Posts

6/recent/ticker-posts

ఏలూరు జిల్లాలో విషాదం.. చెరువులో పడి ముగ్గురు మృతి, ఇద్దరు గల్లంతు


ANDRAPRADESH, ELURU: ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు వద్ద దుర్ఘటన చోటు చేసుకుంది. BY: PASCHIMA VAHINI కోమటి గుంట చెరువులో నీటిలోపడి ముగ్గురు యువకులు మృత్యువాతపడ్డారు. వీరు పెదవేగి మండలం వేగివాడ గ్రామానికి చెందినవారని గుర్తించారు. ప్రమాద ఘటనపై స్థానికులు స్పందించి గల్లంతైన మరో ఇద్దరిని ప్రాణాలతో బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతుల కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేశారు.


చనిపోయిన వారిని అజయ్‌ (28), అభిలాష్‌ (16), సాగర్‌ (16)గా గుర్తించారు. యువకుల మరణంతో వారి స్వగ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సంబంధిత ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు వివరించారు. ఓ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ విషాదం జరిగిందని సమాచారం.

మరోవైపు నిన్ననే (మే 13, 2025) కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. వేసవి సెలవులను పురస్కరించుకొని అమ్మమ్మ ఇంటికి వచ్చిన చిన్నారులు చెరువులో ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు. సాయంత్రం అయినా బయటకు వెళ్లిన పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు గాలించగా.. పిల్లల బట్టలు, చెప్పులు చెరువు ఒడ్డున కనిపించాయి.

గ్రామస్తుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, గజ ఈతగాళ్లతో చెరువులో పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే పిల్లల మృతదేహాలు లభించాయి. చనిపోయిన వారంతా 15 సంవత్సరాల లోపు వారే కావడంతో వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సరదాగా గడపాలని వచ్చిన పిల్లలు ఈతకు వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.