Hot Posts

6/recent/ticker-posts

అన్నదాత సుఖీభవ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఈ డాక్యుమెంట్లు రెడీ చేస్కోండి..


ANDRAPRADESH, AMARAVATHI; రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా మరో రెండు పథకాల అమలుకు సిద్ధమైంది. BY: PASCHIMA VAHINI అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలను అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 12వ తేదీన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు ప్రారంభించాలని నిర్ణయించింది. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలను జూన్ 12 నుంచి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పొలిట్ బ్యూరో సమావేశం అనంతరం ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ వివరాలను వెల్లడించారు.

అన్నదాత సుఖీభవ పథకం అర్హతలు, కావాల్సిన పత్రాలు
అన్నదాత సుఖీభవ పథకం రైతుల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం తీసుకువస్తున్న సంక్షేమ పథకం. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందిస్తారు. పీఎం కిసాన్ యోజనతో కలిసి ఈ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయనుంది. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి రూ.20,000 ఆర్థిక సాయం అందిస్తారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000, కేంద్రం PM కిసాన్ ద్వారా రూ.6,000 అందిస్తుంది. మూడు విడతల్లో అన్నదాత సుఖీభవ పథకం నిధులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమచేయనున్నారు.

అన్నదాత సుఖీభవ పథకం కోసం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 18 ఏళ్లు నిండిన రైతులు మాత్రమే అర్హులు. అలాగే ఈ పథకం లబ్ధి పొందడానికి భూమికి సంబంధించి పక్కా పత్రాలు ఉండాలి. భూమి యాజమాన్య పత్రాలు లేదా పట్టాదారు పాసుపుస్తకం తప్పనిసరిగా ఉండాలి. రైతు పేరు ఆధార్‌ కార్డుతో అనుసంధానమై ఉండాలి. అలాగే ఆధార్ కార్డుతో అనుసంధానమైన బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలి. రైతు పండించే పంటల వివరాలను అధికారుల వద్ద నమోదు చేయించాలి. అలాగే భూమిని లీజుకు తీసుకున్న కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం సాయాన్ని అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వారికి తప్పనిసరిగా కౌలు రైతు ధ్రువీకరణ పత్రం ఉండాలి. పీఎం-కిసాన్ పథకానికి అర్హులైన రైతులందరూ కూడా అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులు అవుతారు. మరోవైపు అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం ఫార్మర్స్ రిజిస్ర్టీలో నమోదు చేయించుకోవాలని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు.

తల్లికి వందనం పథకం - అర్హతలు
మరోవైపు తల్లికి వందనం పథకం కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15000 అందించనున్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం పథకం అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. తల్లికి వందనం కోసం 2025-26 బడ్జెట్‌లో రూ. 9407 కోట్లు కేటాయించారు. తల్లికి వందనం పథకానికి రాష్ట్రంలోని 69.16 లక్షల మంది విద్యార్థులు అర్హులని ఏపీ విద్యాశాఖ అంచనా వేస్తోంది. అయితే తల్లికి వందనం రావాలంటే విద్యార్థులు కచ్చితంగా 75 శాతం హాజరు నిబంధనను పాటించాల్సి ఉంటుందని సమాచారం.