ANDRAPRADESH, AMARAVATHI: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. BY: PASCHIMA VAHINI దీపం 2 పథకం కింద అర్హత కలిగిన కుటుంబాలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. 2024 అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించారు. సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా మహిళలపై ఆర్థిక భారాన్ని తగ్గించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం తెచ్చింది.
ఇక ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కింద తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు నాలుగు నెలలకు ఒకటి చొప్పున ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను అందిస్తోంది. మొదటి సిలిండర్ అక్టోబర్ 31 నుంచి మార్చి 31 వరకు. రెండో సిలిండర్ ఏప్రిల్ 1 నుంచి జులై 31 వరకు.. మూడో ఉచిత గ్యాస్ సిలిండర్ జులై 1 నుంచి నవంబర్ 30 వరకు అందిస్తున్నారు.
లబ్ధిదారులు సాధారణ విధానంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేసి, మొదట డబ్బులు చెల్లించాలి. ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లోగా గ్యాస్ సబ్సిడీ మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తూ వస్తోంది. పట్టణాల్లో 24 గంటల్లో, పల్లెల్లో 48 గంటల్లో గ్యా్స్ సిలిండర్ డెలివరీ చేస్తున్నారు. అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం నగదు చెల్లింపుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేరే ఆలోచన చేస్తోంది. ఉచిత గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులకు ముందుగానే దీపం పథకం నగదు చెల్లింపులు చేయాలని భావిస్తోంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో సిలిండర్ బుకింగ్ కంటే ముందే నగదు చెల్లించాలని నిర్ణయించినట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఏడాదిలో ఉచితంగా అందించే 3 సిలిండర్ల నగదును ఒకేసారి చెల్లించాలని నిర్ణయించినట్లు చెప్పారు. లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ ఎప్పుడు బుక్ చేసుకున్నా, సిలిండర్ తీసుకోకపోయినా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల నగదును ఒకేసారి వారి బ్యాంకు ఖాతాలో వేయాలని నిర్ణయించుకున్నట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు.
అలాగే ప్రతి నెలా సంక్షేమం అందించేలా సంక్షేమ క్యాలెండర్ విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఇక జూన్ 12వ తేదీ నాటికి ఏపీలో టీడీపీ కూటమి సర్కారు ఏర్పడి ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో జూన్ 12న లక్ష మంది ఒంటరి మహిళలు, వితంతువులకు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. అలాగే జూన్ 12న అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.